ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలనమైన ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందన్నారు. తాను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నట్లు జగన్ ప్రకటించారు. అయితే ఇప్పుడు దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు సంధిస్తున్నాయి.
తాజాగా ఈ విషయంపై మంత్రి జోగి రమేష్ రియాక్ట్ అయ్యారు. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎక్కడా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడలేదన్నారు. ప్రజల ఆలోచన, ఆకాంక్షలకు అనుగుణంగానే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. అసెంబ్లీ సాక్షిగా రాజధానులపై మా ప్రభుత్వ విధానాన్ని వెల్లడించామని తెలిపారు.
అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుంది. అలాగే బీజేపీ కోరినట్లే కర్నూలులో న్యాయ రాజధాని ఉంటుందన్నారు. అసలు సీబీఐ కేసుకు, విశాఖ రాజధానికి ఏంటి సంబంధం? ఏంటని ఆయన నిలదీశారు. బురద వేయటమే ప్రతిపక్షాల పని అంటూ కౌంటర్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి ఇల్లు మా ప్రాంతంలోనే ఉంటుందన్నారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందన్నారు. ఈ ప్రాంత నేతలు విశాఖ నుంచి పాలన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి జోగి రమేష్ ప్రకటించారు.