టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజా భేటీపై ఏపీ మంత్రి జోగి రమేష్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరి భేటీపై విమర్శల వర్షం కురిపించారు. బుద్ధి ఉన్నవాడు ఎవరైనా కందుకూరులో, గుంటూరులో చనిపోయిన వారిని పరామర్శిస్తారని, చంద్రబాబు ఇంటికి వెళ్లి పరామర్శించడానికి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. అభం శుభం తెలియని అమాయకులు చనిపోతే.. ఏ రాజకీయ నాయకుడైనా బాధిత కుటుంబానికి నేనున్నానని ధైర్యం ఇవ్వాలి కానీ.. కుప్పంలో డ్రామాలాడిన చంద్రబాబు ఇంటికి వెళ్లాడన్నారు. అసలు చంద్రబాబుకి ఏం జరిగిందని పరామర్శించడానికి పవన్ వెళ్లాడు? అని జోగి రమేష్ నిలదీశారు.
పవన్, చంద్రబాబులది పవర్ ఫుల్ మీట్ కాదని, పవర్ ఫుల్ ప్యాకేజ్ అని ఎద్దేవా చేశారు. సంక్రాంతి ప్యాకేజ్ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడన్నారు. చంద్రబాబే సభలతో పోలీస్ వ్యవస్థ మీద దాడులు చేయించాడని జోగి రమేష్ ఆరోపణలు చేశారు. తనకు అసలు ఎదురే లేదన్నట్టు.. రోడ్ల వెంట చంద్రబాబు తిరిగారని మండిపడ్డారు.
దత్త తండ్రి ఇంటికి దత్తపుత్రుడు వెళ్లాడని దుయ్యబట్టారు. నాకు ఎంత ప్యాకేజ్ ఇస్తావ్, ఎన్ని సీట్లు ఇస్తావ్ అనే విషయాలు మాట్లాడుకోవడానికే ఈ భేటీ అని వ్యాఖ్యానించారు. లోపల అన్ని ప్యాకేజీ వ్యవహారాలే నడుస్తాయని విమర్శించారు. జగన్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ప్రజలు ఎన్నుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ని ఒక అంగుళం కూడా కదల్చలేరన్నారు.
పవన్ కు, చంద్రబాబుకు ప్రజా సమస్యలేమీ పట్టవని.. కేవలం దోచుకోవడం మీదే దృష్టంతా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకి, పవన్ కి ఓటమి తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175కి 175 సీట్లు గెలుస్తుందన్నారు. జగన్ ప్రభుత్వానికే ప్రజలు అనుకూలంగా తీర్పు ఇస్తారని నమ్మకం వ్యక్తం చేశారు జోగి రమేష్.