చుక్కల భూములపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చుక్కల భూములకు సంబంధించి ముఖ్యమంత్రి జీవో విడుదల చేయడంతో రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ భూముల కోసం టీడీపీ హయాంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని.. వీఆర్వో నుంచి ఫైల్ రావాలంటే ఆరు నెలలు పట్టేదని విమర్శించారు.
అయినా చాలా భూములకు సంబంధించి పరిష్కారం లభించలేదన్నారు. రైతుల సమస్యలు చూసిన సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. చాలా చోట్ల రైతులు భూములను సాగు చేసుకుంటున్నారని.. వీరికి పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.
చంద్రబాబు హయాంలో వీటిని నిషేధిత జాబితాలో పెట్టారన్న ఆయన.. రైతుల కష్టాలు చూసి జగన్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో నెల్లూరులోనే 40 వేల ఎకరాల మేర రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే జిల్లాలో పర్యటించి రైతులకు పత్రాలు అందిస్తారని పేర్కొన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి .
ఇంతకీ చుక్కల భూములు అంటే..
1924-1946 మధ్య కాలంలో రెవెన్యూ శాఖ ఓ సర్వే చేశారు. ఆ సర్వే జరుగుతున్నప్పుడు కొన్ని చోట్ల భూముల యజమాని అందుబాటులో ఉండకపోవడంతో.. సంబంధిత కాలమ్ లో చుక్కలు పెట్టారు. ఇలాంటి చుక్కలు పెట్టిన భూములనే ‘చుక్కల భూములు లేదా డాటెడ్ ల్యాండ్స్’ అని అంటూంటారు. భూములు లేని రైతులు, పేదలకు ఈ భూములు కేటాయించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.