తెలంగాణ మంత్రులపై ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలేనని ఫైర్ అయ్యారు. తెలంగాణ నేతలే ఏపీకి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు భయంతో ఉన్నారన్నారు. తెలంగాణ మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ మంత్రులు ఏపీని ఉద్దరిస్తారంటూ ఎద్దేవా చేశారు. శ్రీశైలంలో దొంగ కరెంట్ తీసుకుంటున్నారని పేర్ని నాని ఆరోపించారు. కేఏ పాల్ కూడా 175 స్థానాల్లో పోటీ చేస్తున్నారని.. బీఆర్ఎస్ పోటీ చేస్తే తప్పులేదని ఎద్దేవా చేశారు మంత్రి పేర్ని నాని.
సోమవారం ఉదయం మాజీ మంత్రి కొడాలి నాని బీఆర్ఎస్ పై స్పందించారు. ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఏ మాత్రం చూపించదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడైనా పోటీ చేయొచ్చని.. కానీ అంశాల వారీగానే జాతీయ పార్టీలకు వైసీపీ మద్దతు ఇస్తోందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైసీపీ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు మాజీ మంత్రి కొడాలి నాని.
కాగా ఆంధ్ర ప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఏపీకి చెందిన ముగ్గురు కీలక నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి స్వాగతం అంటూనే వైసీపీ నేతలు సున్నితంగా విమర్శలు చేస్తున్నారు. మరి వారి కామెంట్స్ పై తెలంగాణ మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.