అమరావతి టూ అరసవల్లి మహా పాదయాత్రపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ పాద యాత్రపై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో తిరుమలకు చేరుకున్నారు రోజా. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు రోజా కుటుంబ సభ్యులు. దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు రోజా కుటుంబ సభ్యులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు.
అమరావతి వాళ్లది రాజధాని యాత్ర కాదు.. అత్యాశ యాత్ర అని మండిపడ్డారు. వైజాగ్ ప్రజలను రెచ్చగొట్టడానికే అమరావతి రైతులు అటు వైపు పాదయాత్ర చేస్తున్నారన్నారు. జనసేన అధినేత పవన్ ట్వీట్లు అవగాహనారాహిత్యంతో చేస్తున్నవే అని ఆమె ఎద్దేవా చేశారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు. 26 గ్రామాల కోసం 26 జిల్లాలను ఫణంగా పెట్టలేమన్నారు. చంద్రబాబుకి అమరావతిపై ప్రేమ ఉంటే ఐదేళ్ల కాలంలో ఎందుకు అభివృద్ధి చేయలేదని ఆమె ప్రశ్నించారు.
ప్రశాంత నగరంలో గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు రోజా. మూడు రాజధానుల ఏర్పాటుతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారన్నారు. టీడీపీ మద్దతులోనే ఉత్తరాంధ్రలో రైతులు పాదయాత్ర చేస్తున్నారని, ఈ పాదయాత్రలో తొడలు గొట్టి, మీసాలు దువ్వుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు నిద్ర లేచి ట్వీట్ ల ద్వారా ఏదో ఒక యాగీ చేస్తూంటాడని, ఉత్తరాంధ్రలో ప్రజలు వలస పోతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నాడని మంత్రి రోజా ఆరోపించారు. గతంలో ఆయన మిత్ర పక్షంగా ఉన్నప్పుడు ప్రజలు వలసపోలేదా అంటూ మండిపడ్డారు రోజా. అధికారంలోకి జగన్ వచ్చాక ఉత్తరాంధ్రను ఎంతో అభివృద్ధి చేసాడని, రోజుకో మాట.. పూటకో వేషం వేస్తూ తిరిగితే పవన్ కళ్యాణ్ ను ప్రజలు కొట్టే రోజు త్వరలోనే వస్తుందన్నారు మంత్రి రోజా.