జన సైనికుల లక్ష్యాన్ని, ఆశయాన్ని, కష్టాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టాడని విమర్శించారు వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ రీల్ హీరోనని.. జీవితంలో ఎప్పటికీ రియల్ హీరో కాలేదని ఎద్దేవా చేశారు. పవన్ ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ వెంట్రుక కూడా పీక లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొన్న చంద్రబాబును కలిసినప్పుడే పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని ఆరోపించారు. అడ్వాన్స్ తీసుకున్నాడు కాబట్టే.. జన సైనికులను ముందుగానే అలెర్ట్ చేస్తున్నారన్నారు. పవన్ అవగహన లేకుండా మాట్లాడాడన్నారు. ఈ జన్మకి పవన్ కళ్యాణ్ నాయకుడు కాలేడు.. అలాగే రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి కాలేడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.
రియల్టర్ల కోసమే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. అటువంటి వారికే పవన్ కళ్యాణ్ కూడా వంత పాడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ మాటలకు చేతలకు పొంతన లేదని ఆయన మండిపడ్డారు. తమ ప్రాంతానికే వచ్చి తమపైనే విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు మంత్రి ధర్మాన.
నిజాయితీ ఉన్న నేతలకు మద్దతు ఇస్తామని చెబుతూ.. అవినీతిపరుడైన చంద్రబాబును సమర్థించి శ్రీశ్రీ నీతులు చెబుతావా? అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ కు ఒక స్టాండ్ లేదని, తన లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోతున్నారో ఆలోచించాలని అన్నారు. చంద్రబాబుకు పొరపాటున అధికారం ఇస్తే మళ్ళీ అమరావతిలోనే పెట్టుబడి పెడతారన్నారు.
ఒకవేళ అదే జరిగితే విశాఖ కేంద్రంగా తమకు ప్రత్యేక రాష్ట్రం అడుగుతామన్నారు. తాను సైనికుల భూములు కబ్జా చేశానంటున్నారు. తాను భూమి కబ్జా చేశానని ఏ సైనికుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. పుస్తకాలు చదవడం కాదని.. ఆ గొప్పవారి భావజాలం పవన్ లో కనిపించాలన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.