ఏపీలో రహదారులు, నీళ్లు, కరెంట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర అమాత్యులు ఫైరవుతున్నారు. కేటీఆర్.. తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాను హైదరాబాద్ లోనే ఉండి వస్తున్నానని.. అక్కడ కరెంట్ లేదని.. తాను ఉన్నంత సేపు జనరేటర్ పెట్టుకుని ఉండాల్సి వచ్చిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి గురించి స్నేహితుడు చెప్పింది విని ఏం తెలుసుకోకుండా కేటీఆర్ నోరుపారేసుకోవడం సరికాదని హితవుపలికారు. వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని.. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బొత్స.
మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాల కోసమే కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఏపీలో విద్యుత్ కోతలు లేవని తేల్చి చెప్పారు. రైతులకు ఏడు గంటలు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఎక్కడైనా సాంకేతిక సమస్యతో పావుగంట మాత్రమే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని వివరించారు పెద్దిరెడ్డి. తను ప్రత్యక్షంగా చూస్తేనే మాట్లాడాలి తప్పితే.. ఇతరులు చేసిన ఆరోపణలు పట్టుకొని నిందలు మోపడం సరికాదని మండిపడ్డారు. ఇది ఓ రాష్ట్ర మంత్రికి ఉండాల్సిన లక్షణం కాదని అన్నారు పెద్దిరెడ్డి.