తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. అసెంబ్లీ లాబీల్లో ఈ భేటీ జరిగింది. అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో ఈ భేటీ జరగ్గా, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలపడంతోనే ఈ భేటీ జరిగిందా… వ్యక్తిగత పనులపై జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపారు. అవసరం అయితే ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటామని, ఏపీకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా అంటూ కామెంట్ చేశారు.
మంత్రి కేటీఆర్ తో భేటీ తర్వాత ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకే వచ్చానని గంటా తెలిపారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రులతో కలిసి ఓ బృందంగా విశాఖకు వస్తామని కేటీఆర్ చెప్పినట్లు గంటా పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం తాను ఇప్పటికే రాజీనామా చేసినట్లు గంటా గుర్తు చేశారు.