నగరంలోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు.గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్ కు ఏపీ మళ్లించిందని.. అందులో తెలంగాణకు 45 టీఎంసీల నీటి వాటా రావాలని ఆయన తెలిపారు.
ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ నుంచి అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నాయని.. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సీడబ్ల్యూసీకి పంపించినట్లు తెలిపారు. ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలను జీఆర్‌ఎంబీ ఛైర్మన్ తిరస్కరించారని.. తాము లేవనెత్తిన అన్ని అంశాలను ఆయన పరిగణనలోకి తీసుకున్నారని వివరించారు. తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.
అలాగే సీలేరు ప్రాజెక్టులో తెలంగాణ వాటాపై కూడా చర్చించినట్లు చెప్పారు. తెలంగాణకు చెందిన చనాకా-కొరాటా, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటనగరం పంప్‌హౌస్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్‌లపై చర్చ జరిగినట్లు వెల్లడించారు రజత్ కుమార్.
తెలంగాణ తలపెట్టిన 3 ఎత్తిపోతల ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించినట్లు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ వెల్లడించారు. ‘‘మూడు ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలను చెప్పామన్నారు. 3 ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవని అన్నారు. గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం చేయాలని కోరామని వెల్లడించారు. గోదావరి జలాలపై ట్రైబ్యునల్ వేయాలని కోరామని స్పష్టం చేశారు. గోదావరిలో నీటి లభ్యతపై కేంద్రం అధ్యయనం చేయాలని కోరినట్టు తెలిపారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల భద్రతపై పాండ్య కమిటీ రిపోర్టు ఇచ్చిందని.. ఎవరికెంత కేటాయింపులనేది తేల్చాలని కోరానిట్టు తెలిపారు శశిభూషణ్.