ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. విజయనరగం జిల్లా మినహా రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 6.30 ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగనుంది. పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా నోటాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక కరోనా పాజిటివ్ బాధితులకు కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. పీపీఈ కిట్లతో చివరిలో గంటసేపు వారు ఓటు వేయనున్నారు.
తొలి విడత పోలింగ్ జరిగే సర్పంచి స్థానాల్లో మొత్తం 7,506 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక 20,157 వార్డు సభ్యుల స్థానాలకుగాను 43,601 మంది పోటీలో ఉన్నారు. వాస్తవానికి 3,249 గ్రామ పంచాయతీలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది కానీ ఇందులో ఇప్పటికే 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి.