‘నిను వీడని నీడను నేనే’ అనే పాటలా టీడీపీ యువనేత నారా లోకేష్ ను ఏపీ పోలీసులు వదలడం లేదు. లోకేష్ పాదయాత్ర చేపట్టిన దగ్గర్నుంచి ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టిస్తునే ఉన్నారు. మైక్ లాగేసుకోవడం, కుర్చీని లాక్కోవడం, ప్రజలను పాదయాత్రకు రానీయకుండా అడ్డుకోవడం ఇలా అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారు. తాజాగా లోకేష్ పాదయాత్రలో సోమవారం నుంచి కొత్తగా వీడియో కెమెరాలు వచ్చి చేరాయి.
పోలీసులు దగ్గర ఉండి మరీ వీడియో కెమెరా ద్వారా తాము చెప్పిన విజువల్స్ ను తీయించుకుంటున్నారు. ఇప్పటి వరకు అక్కడక్కడ డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసులు నిఘా పెట్టిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం నుంచి రెండు వీడియో కెమెరాలను పెట్టి ప్రత్యేకంగా కొన్ని విజువల్స్ ను షూట్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చిత్రీకరణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కాగా సోమవారం ఉదయం చంద్రగిరి మండలం శానంబట్ల పంచాయతీ శివగిరిలో విడిది కేంద్రం నుంచి లోకేష్ యువగళం పాదయాత్రను మొదలుపెట్టారు. లోకేష్ ఇప్పటివరకూ 380 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ రోజు శానంబట్ల గ్రామంలో స్థానికులతో మాటామంతీ నిర్వహించారు. పిచ్చినాయుడుపల్లిలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశమయ్యారు.
మధ్యాహ్నం తొండవాడలో లోకేష్ భోజన విరామం తీసుకోనున్నారు. అనంతరం 3 గంటలకు తొండవాడ నుంచి పాదయాత్ర కొనసాగనుంది. 4:30 గంటలకు చంద్రగిరి టవర్ క్లాక్ జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ చేయనున్నారు. 5 గంటలకు చంద్రగిరి నూర్ జంక్షన్ లో స్థానికులతో భేటీ అవనున్నారు. ఇక రాత్రి మామందురులో బస చేయనున్నారు నారా లోకేష్.