ఏపీలో సంక్రాంతి కల సంతరించుకుంటుంది. పట్టణాల నుంచి గ్రామాల బాట పట్టిన యువతతో కలకలలాడుతోంది. ఆటలు, పాటలు, ముగ్గులతో ఊర్లన్ని ముస్తాబవుతున్నాయి. ఇక సంక్రాంతి అంటే దేశం మొత్తం తన వైపు తొంగి చూసేలా గోదావరి జిల్లాలు చేసిన హడావిడే వేరు. ప్రధానంగా గోదావరి జిల్లాలో కోళ్ల పందాలు జరుపుతూ కోట్లలో బెట్టింగ్ లు వేస్తారు. దీనిపై ఏపీ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. కోళ్ల పందాలకు ఎలాంటి అనుమతులు లేవని తేల్చి చెప్పింది. కాదని.. ఎవరైనా పందాలు నిర్వహిస్తే.. చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సాంప్రదాయ సంక్రాంతిని నిర్వహించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. కోడిపందాలు, పేకాట, గుండాట వంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ “సంప్రదాయ సంక్రాంతి” క్రీడా పోటీలను జరుపుకోవాలని సూచించారు. స్థానిక పోలీసులు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ అధికారుల సహకారంతో కోడిపందాలు నిర్వహించే బరులను గుర్తించే పనిలో పడ్డారు. రెవిన్యూ అధికారులను సమన్వయం చేసి గతంలో కోళ్ల పందాలు నిర్వహించిన వారికి ముందస్తు నోటీసులు పంపిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇప్పటికే గుర్తించిన కొన్ని బరులను ధ్వంసం చేశారు. అమలాపురం, రామచంద్రాపురం, పెద్దాపురం సబ్ డివిజన్లు, ఏజెన్సీ ప్రాంతాలలో పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు చేసి రెండు రోజుల నుంచి బరులను ధ్వంసం చేస్తున్నారు. కోడిపందాల నిర్వహణకు ఎటువంటి అధికారిక, అనధికారిక అనుమతులు లేవని స్పష్టం చేశారు. అటువంటి ప్రచారాలు, వదంతులను నమ్మొద్దని చెప్పారు. జిల్లా ప్రజలంతా సంక్రాంతి పండగను సంప్రదాయబద్దంగా జరుపుకోవాలని తెలిపారు.