ఆయన కుటుంబం ఎప్పుడో మతం పుచ్చుకుంది. రాజకీయంగా అది అడ్వాంటేజ్ కూడా అయింది. తండ్రి సమయంలోను, ఇప్పుడు తన హయాంలోను కూడా అది అందరికీ కనపడుతున్నదే. కాని, 2009లో పార్టీ పెట్టినా, పదేళ్ల పాటు అధికారం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. పాదయాత్రలు, పీకే లాంటి కన్సల్టెంట్లు, సోషల్ మీడియా ప్రచారం.. అటు కేంద్రం పెద్దలతో కరచాలనం.. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రితో ఫ్రెండ్ షిప్.. ఒకటేమిటి.. ఎన్ని అస్త్రాలుంటే అన్నీ వాడేశారు.. అందులో భాగంగానే.. ఎవరు సలహా ఇచ్చారో గాని.. హిందూ సంప్రదాయిక పూజలు చేశారు. ఆ వీడియోలు బయటకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి హిందూ మతంలోకి మళ్లీ తిరిగి వచ్చారంటూ సోషల్ మీడియా తెగ కూసింది. కాని అధికారికంగా ఒక్కసారి కూడా ఆ విషయం జగన్ గాని, ఆయన కుటుంబం గాని, ఇతరులు గాని చెప్పలేదు. శారదాపీఠం అధిపతి స్వరూపానంద స్వామితో అనుబంధం పెరిగింది. ఆయన నిర్వహించిన ఓ పూజా కార్యక్రమంలో ఏకంగా జగన్ కు జగన్ స్టయిల్ లో ఓ ముద్దు పెట్టేశారాయన. ఇవన్నీ జగన్ కూడా హిందూ సంప్రదాయాలను పాటిస్తున్నడాని కొందరు వాదించడానికి కారణమైంది. పైగా ఆయనొక్కడే హిందువు.. మిగిలినవారంతా వారు పుచ్చుకున్న మతాన్నే పాటిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు.
ఇప్పుడు మళ్లీ మతం తెరపైకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని కాస్త నొక్కి వక్కాణించారు. తిరుమలకు వెళితే.. అన్య మతస్తులు ఒక డిక్లరేషన్ ఇవ్వాలనే రూల్ ఉంది. అంటే తాము ఇతర మతస్తులం అయినప్పటికీ, వెంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందని, అందుకే దర్శనం చేసుకుంటున్నామని ఆ డిక్లరేషన్ లో ఉంటుంది. దానిపై సంతకం పెట్టి వారు దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. హిందువును చేసుకున్నప్పటికీ జన్మత: క్రిస్టియన్ అయిన సోనియాగాంధీ, ముస్లిం అయిన అబ్దుల్ కలాంగార్లు… అలా డిక్లరేషన్ ఇచ్చే దర్శనం చేసుకున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరందరికీ అతీతమా.. డిక్లరేషన్ ఎందుకివ్వరూ అంటూ నాయుడుగారు నిలదీశారు. జగన్ తిరుమలకు అధికారంలోకి రాక ముందు ఒకసారి వచ్చారు. అప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించారు. తమ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు వచ్చారు.. మళ్లీ తాను కొత్తగా ఇచ్చేదేంటి? అయినా తాము హిందువులమని ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలని జగన్ మండిపడినట్లు వార్తలొచ్చాయి. ఆయన సీఎం కాకముందే అంత కాక చూపిస్తే.. సీఎం అయ్యాక ఎవరైనా అడిగే ధైర్యం చేస్తారా? అందుకే ఎవరూ అడగలేదు. సీఎం అయ్యాక అధికారికంగా దర్శనం చేసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి.
ఇక్కడ సమస్య ఏంటంటే.. ఆయన తాను హిందువునేనని ప్రకటించరు.. ఎందుకంటే తమను అభిమానిస్తున్న మతస్తులు హర్టవుతారు కాబట్టి. అప్పటికి ఓ ఫాదర్ ప్రశ్నించాడు కూడా.. జగన్ తాను ఏ మతం ఫాలో అవుతున్నాడో తేల్చి చెప్పాలని. అటు క్రిస్టియన్ అనీ చెప్పరు.. అలా కథ నడిపించేస్తున్నారు. అయితే అలా ఎక్కువకాలం నడిపించలేరేమోనని ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి.
చంద్రబాబునాయుడు కామెంట్లపై మండిపడితూ.. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు చురుకు పుట్టిస్తున్నాయి. ‘‘డిక్లరేషన్ ఇచ్చేదేంటి? నీయమ్మ మొగుడేమైనా కట్టించాడా తిరుమల గుడిని. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళతారు.. ఏ గుడికైనా వెళతారు.. నీ పర్మిషన్ కావాలా.. ఎవరి పర్మిషన్ కావాలి’’ అంటూ రెచ్చిపోయారు కొడాలి నాని. అంతే నిప్పు రాజుకుంది.
బిజెపి రంగంలోకి దిగిపోయింది. తిరుమల దేవస్థానాన్ని ఎవడు కట్టించాడంటూ నీ ఇష్టమొచ్చిన భాష మాట్లాడతావా అంటూ మండిపోతోంది. ఇప్పటికే అధికారికంగా కంప్లయింట్ ఇచ్చింది. పైగా మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేస్తావా లేదా అని జగన్ ను డిమాండ్ చేస్తుంది. డిక్లరేషన్ ఇవ్వనక్కర్లేదన్న వ్యాఖ్యలను సైతం బిజెపి సీరియస్ గా తీసుకుంది. డిక్లరేషన్ ఇవ్వకుండా ఈసారి జగన్ వెళితే.. ఈసారి బిజెపి అగ్గిమీద గుగ్గిలం అవటం ఖాయం. అలా చంద్రబాబునాయుడు అగ్గిపుల్ల గీస్తే.. కొడాలి నాని పెట్రోల్ పోశారు.. ఇప్పుడు బిజెపి ఆ మంటల్లోనే రాజకీయ యాగం చేయబోతుంది.