ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ సర్కార్ మధ్య ఉన్న ఆధిపత్య పోరు ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తుంది. ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మొదట అధికారులను పరుగులు పెట్టించిన నిమ్మగడ్డ, ఆ తర్వాత కార్పోరేషన్ చైర్మెన్లు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదార్లు మంత్రులపై గురిపెట్టారు.
అధికారులపై చర్యల వరకు వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్న ప్రభుత్వం… నిమ్మగడ్డ జిల్లాల పర్యటన సందర్భంగా చేస్తున్న కామెంట్లతో అగ్గిమీద గుగ్గిలమవుతుంది. ముఖ్యంగా వైఎస్ పేరును తీసుకోవటం, అప్పట్లో తాను ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్నానంటూ చెప్పిన మాటలు బ్లాక్ మెయిల్ చేసేవిగా ఉన్నాయని వైసీపీ మండిపడుతుంది. దానికి తోడు మంత్రులపై గవర్నర్ కు లేఖ రాసి, మీడియాకు లీక్ చేశారని ఆరోపణలున్నాయి.
దీంతో నిమ్మగడ్డ దూకుడుకు కళ్లెం వేయాలన్నఉద్దేశంతోనే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. స్పీకర్ కూడా దాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. మంత్రుల ఫిర్యాదుపై భేటీ అయిన ప్రివిలేజ్ కమిటీ… విచారణకు స్వీకరించింది. తమకు ఎవర్నైనా పిలిచి విచారించే అధికారం ఉందని, రూల్ 173 ప్రకారం ముందుకెళ్తామని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఎస్ఈసీని సైతం విచారించి, చర్యలు తీసుకున్న మహారాష్ట్ర ఉదంతాన్ని తెరపైకి తెచ్చారు.
అయితే, ఇప్పటికిప్పుడు నిమ్మగడ్డను విచారణకు పిలవలేదు. అంటే… మీరు ఇక నుండి ఒక్క అడుగు దూకుడు ప్రదర్శిస్తే, మీపై కత్తి వేలాడుతుందని గుర్తు చేసే ఉద్దేశంతోనే ఈ వాయిదా అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కోర్టుల్లో సైతం తమకు ఇబ్బందిగా ఉన్న నిమ్మగడ్డ వ్యవహారాన్ని ఇక నుండి ప్రివిలేజ్ కమిటీ నుండి నరుక్కొచ్చే పనిలో సర్కార్ ఉందంటూ విశ్లేషిస్తున్నారు.