అధికారంలోకి వచ్చాక నవరత్నాలు తప్ప.. మిగిలిన అన్ని విషయాల్లో అన్నీ రివర్సే. కాని ఒకే ఒక్క పాలసీతో హిట్ కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి. తెలుగు భాషకు అన్యాయం జరుగుతోందని, మాతృభాషను భావితరానికి దూరం చేస్తున్నారని మేధావులు, కొందరు రాజకీయ నాయకులు ఆవేదన చెందుతున్నా.. జనం మాత్రం జగన్ నిర్ణయానికి వెల్ కమ్ చెబుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం అంటే .. మంచిదే కదా అంటూ వారు ఆనందపడుతున్నారు. లక్షలకు లక్షలు ప్రైవేటు స్కూళ్లలో కట్టే పనుండదు కదా.. అని వారు సంబరపడుతున్నారు.
కాన్వెంట్ కు పంపాలంటే లక్షల ఖర్చు. అదే గవర్నమెంట్ స్కూల్ లో అదే ఇంగ్లీషు మీడియం పెడితే.. ఇక అక్కడే మా పిల్లలను చేరుస్తాం. చదువు కోసం పెట్టే ఖర్చు తగ్గితే, మా కష్టాలు తగ్గినట్లే కదా అంది ఓ మహిళ.
ప్రస్తుతం నడుస్తున్న విద్యావ్యవస్ధే జగన్ నిర్ణయానికి జేజేలు పలికేందుకు కారణమవుతోంది. కార్పొరేట్ స్కూళ్ల పేరుతో ఫీజులు భారీగా వసూలు చేయడం.. వాటిలో పిల్లలను చదివించకపోతే.. వెనకబడిపోతారనే భయం, ఆందోళన.. తల్లిదండ్రులను తమ శక్తికి మించి మరీ డబ్బులు ఖర్చు పెట్టే దిశగా లాక్కుపోయాయి. ప్రతి కుటుంబం తమ ఆదాయంలో విద్య, ఆరోగ్యం కోసమే 80% ఖర్చు పెట్టాల్సిన పరిస్ధితులు ఏర్పడ్డాయి. అందుకే ఉచితంగా ఇంగ్లీషు మీడియం అంటే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది.
తెలుగు మీడియం తీసేస్తే.. ఎలా, చిన్న వయసులో మాతృభాషలోనే అధ్యయనం కరెక్టు.. వంటి వాదనలు, ఇతర దేశాల ఉదాహరణలు ఇవేమీ జనం పట్టించుకోవడం లేదు. పైగా జగన్ వెనకబడిన వర్గాల వారికి ఇంగ్లీషు విద్య అందుబాటులో లేదని, దీనితో అది అందుబాటులోకి వస్తుందని చేస్తున్న ప్రచారం కూడా.. ఆయా వర్గాల్లో బాగానే పని చేసింది. సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్లు చూస్తే ఆ విషయం అర్ధమవుతోంది.
ఇన్ని లక్షల మంది ఇంగ్లీషు మీడియంలో చదువుతుంటే తెలుగుభాషకు జరగని అన్యాయం, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీషు మీడియం పెడితే ఎలా జరుగుతుందని సోషల్ మీడియాలో జనం ప్రశ్నలు సంధిస్తున్నారు. తెలుగుభాషను సమర్ధిస్తూ వాదనలు చేస్తున్నవారు.. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. సౌకర్యాలు లేని ప్రభుత్వ స్కూళ్లు, ఇంగ్లీషులో బోధించే టీచర్లు లేని స్కూళ్లు.. ఈ కొత్త పాలసీని ఎలా అమలు చేస్తారనే సందేహాలను పుట్టిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జనం వరకు మాత్రం ఆ విషయం పట్టించుకోవడం లేదు. ప్రాక్టికల్ గా చాలా సమస్యలు వస్తాయనే అంచనాలు అయితే ఉన్నాయి. కాని సర్కారు బడుల్లో ఇంగ్లీషు మీడియం సమర్ధవంతంగా చెప్పగలిగితే మాత్రం.. ప్రైవేటు స్కూళ్లు దెబ్బ తినటం ఖాయం.. ప్రభుత్వ స్కూల్లో సీట్ల కోసం పోటీ పెరగడమూ అంతే ఖాయం.