అసలు రెవెన్యూలో వెనుకబాటు.. వారి రెవెన్యూలో అగ్రస్థానం - Tolivelugu

అసలు రెవెన్యూలో వెనుకబాటు.. వారి రెవెన్యూలో అగ్రస్థానం

AP revenue department versus revenue employees in earnings, అసలు రెవెన్యూలో వెనుకబాటు.. వారి రెవెన్యూలో అగ్రస్థానం

‘‘అబ్బాయి గోల్డ్. మీరు కో అనందే పని కాదు. కోట్లు కుమ్మరించినా అలాంటి అల్లుడు దొరకడు. సాఫ్ట్ వేర్ కు ఇప్పుడు గిరాకీ లేదు. రియల్ ఎస్టేట్ డల్లయిపోయింది. సర్కారు సర్వీసే గాని..అందులో మంచి ఖరీదైన సర్వీసు మనోడిది. మీరు బేరాలు ఆడితే నడవదు. కళ్లు మూసుకుని ఎంత చదివించుకోగలరో చెప్పండి.. పనవుద్దో లేదో నేను చెబుతా. ఊరికే ఆలోచించకండి.. అమ్మాయిని బంగారంతో కప్పెట్టేస్తాడంతే.’’

‘‘అంత గొప్ప సంబంధమా.. ఇంతకీ ఏం చేస్తాడో’’… ‘‘మీరు మరీ అమాయకులండీ.. ఆ మాత్రం అర్ధం చేసుకోలేరా.. అబ్బాయికి రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం.. జీతం ఖర్చులకు పోతే.. గీతం గీత మార్చేస్తుందంతే’’.

అదీ సంగతి. రెవెన్యూ ఉద్యోగుల అవినీతి అక్కడిదాకా పోయింది. ఏపీ సర్కార్ అవినీతి మీద ఫిర్యాదులు చేయడానికి ఓ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది. దానికి వస్తున్న కాల్స్ ను విశ్లేషిస్తే.. గుంటూరు జిల్లా టాప్ అని తేలిందని న్యూస్ వచ్చింది. కాని అసలు టాప్ న్యూస్ ఏంటంటే.. రాష్ట్రమంతా టాప్ కరెప్షన్ జరిగేది.. జరుగుతుంది రెవెన్యూ శాఖలోనేనని.

రెవెన్యూ శాఖలో అవినీతి ఉందని స్వయంగా గతంలో మంత్రులుగా పని చేసిన కెఈ కృష్ణమూర్తివంటి వారు ఓపెన్ గానే ఒప్పుకున్నారు. మరి ఏసీబీలో అవినీతి అంటూ హంగామా చేసిన ప్రస్తుత రెవెన్యూ మంత్రి సుభాష్ చంద్రబోస్ గారు.. ఈ ఫోన్ కాల్స్ తో ఏమంటారో మరి.
అసలు సమస్య ఎక్కడొస్తుందంటే.. పిల్లగాళ్ల చదువుల దగ్గర నుంచి, ఉద్యోగాల వరకు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి.. భూముల పంపకం వరకు.. అన్నీ ఈ డిపార్ట్ మెంట్ చుట్టూనే తిరుగుతాయి. రిజర్వేషన్ కావాలంటే.. కేస్ట్ సర్టిఫికెట్ కావాలి.. అది కావాలంటే రెవెన్యూ డిపార్ట్ మెంట్ కు పోవాలే. అక్కడ ఇన్ వార్డ్ సెక్షన్ (టపా) నుంచి.. క్లర్క్ దాకా లెక్కేసి ఫిగర్ చెబితే.. ఆ ఫిగర్ కట్టేసి.. సర్టిఫికెట్ తీసుకోవాలే.

ఇప్పుడు సంక్షేమ పథకాలు పెరిగిపోయాయి. ప్రతి దానికి.. రేషన్ కార్డు, కులం సర్టిఫికెట్, నేటివిటీ, బర్త్ సర్టిఫికెట్.. ఆదాయం సర్టిఫికెట్.. ఇలా అన్నీ సబ్ మిట్ చేసుకోవాల్సిందే. ఇప్పటి జనరేషన్ కు కొన్ని మాత్రమే అవసరం. కాని పాత జనరేషన్ వారికి ఏమీ లేవు కాబట్టి.. వారు అన్నీ తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ కాగితాల కోసం .. కరెన్సీ కాగితాలు కొట్టందే రెవెన్యూ డిపార్ట్ మెం ట్ లో పని కాదని అందరికీ తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు. భూముల వ్యవహారం మరో ఎత్తు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం..ఎంత నడుస్తుందో రోజూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న తాడేపల్లిలోనే.. ఓ రైతు పెట్రోల్ సీసా తీసుకుని తహశీల్దార్ దగ్గరికి పోయాడు. అప్పుడుగాని అతని సమస్య తీరలేదు. పక్కనే ఉన్న చినకాకానిలో వీఆర్ఏ లంచం తీసుకుంటుండగా వీడియో తీసి మరీ జనం పట్టించారు.

ఇవన్నీ చిన్న విషయాలు. ఎకరాలకు ఎకరాలు దేవాలయ భూముల కింద, అసైన్డ్ ల్యాండ్స్ కింద ఉన్నవాటిని కథ మార్చేసి.. సొంతం చేసుకోవడానికి రాజకీయ నాయకులు అదే పని మీద ఉంటారు. వారికి గైడెన్స్, గైడ్ లైన్స్ తో పాటు.. పని చేసి పెట్టేది ఈ రెవెన్యూ ఉద్యోగులే. మామూలు వ్యక్తి వెళ్లి తన పొలం సర్వే చేసి సర్టిఫికెట్ ఇవ్వాలని అడిగితే రెండు నెలలు తిప్పుకుంటాడు.. ఛార్జీ చెల్లిస్తే మాత్రం రెండురోజుల్లో చేసి పెడతాడు. అదే పెద్ద వ్యవహరాలు వస్తే మాత్రం ఏకంగా పర్సంటేజీయే తీసుకుంటారు.

ఎటొచ్చీ.. ఏసీబీ ఎప్పుడూ క్లర్కులు, వీఆర్ఓలను తప్పితే.. తహశీల్దార్ లెవెల్లో ఎవరినీ పట్టుకున్నది లేదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఏసీబీ నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో కూడా నమోదైన రెవెన్యూ అధికారులు, మిగతా డిపార్ట్ మెంట్లతో పోలిస్తే తక్కువే.

మొత్తం మీద ప్రభుత్వం పెట్టిన టోల్ ఫ్రీ నెంబరుకు మాత్రం వేలాది కాల్స్ వస్తున్నాయి. వీటి మీద ఏసీబీ ఎంక్వయిరీ చేస్తోంది. ఏసీబీ దాడులు చేస్తేనే, సదరు అధికారి వెళ్లి మరో రాజకీయ నేతను వెంటబెట్టుకుని జీవో జారీ చేయించుకుని మరీ, బయటపడ్డ సందర్భాలు కోకొల్లలు. వైసీపీ వచ్చిన జూన్ నెలలోనే అలాంటి జీవోలు చాలానే వచ్చాయి. ఇప్పుడు కూడా కంప్లయింట్ వచ్చిన అధికారులంతా మళ్లీ అధికార పార్టీ నేతలను ఆశ్రయిస్తారు.. వారి రికమెండేషన్ తో వీరు బయటపడతారు. మరి ఈ తతంగం నడవకుండా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో అడ్డుకుంటారా.. లేక మీ సంగతేంటి అని అడిగే తన పార్టీ నేతలను చూసి తల తిప్పుకుని.. తప్పించుకుంటారా.. మరో మూడు నెలల ఆగితే చాలు. తేలిపోద్ది.

Share on facebook
Share on twitter
Share on whatsapp