యాంటీ కరెప్షన్ బ్యూరో.. అవినీతి నిరోధక శాఖ.. ఇప్పుడు ఈ డిపార్ట్ మెంట్ పై ఒక పథకం ప్రకారం దాడి జరుగుతుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అవినీతికి వ్యతిరేకం అని చెప్పే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇది మరింత దూకుడుగా పని చేయాల్సి ఉండగా.. దానికి ముకుతాడు వేసే ప్రయత్నాలు కనపడుతున్నాయి.
స్వయంగా రెవెన్యూ మంత్రి తీవ్రమైన పదాలతో అవమానకరంగా మాట్లాడటంతో.. ఏసీబీ ఉన్నతాధికారులు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాక దిక్కులు చూస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల్లో ఏదైనా తప్పులు జరిగితే.. అంతర్గత విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు.. ఇక్కడ మంత్రి మాత్రం ఓపెన్ గా ఆయనే విచారణ చేసి నిర్ధారించేసి.. డైరెక్ట్ గా తిట్టిపారేశారు. అసలు ఏసీబీ ఇలా ఉంటే.. ఎలా అనటమే కాదు.. ఇలా వీళ్లు ఎన్ని చేశారో అనడమే అందరికీ షాక్ ఇచ్చింది.
విశాఖలోని ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుపై ఏసీబీ దాడి చేసి.. అదనపు అమౌంట్ ఉందని.. ఆ సబ్ రిజిస్ట్రార్ పై చర్య తీసుకోవాలని.. డిపార్ట్ మెంట్ కు రిఫర్ చేశారు.. వెంటనే ఆ శాఖాధిపతి సస్పెంచ్ చేసేశారు. అయితే తనను కావాలని ఇరికించారని.. లేని క్యాష్ ఏసీబీవారే తెచ్చారంటూ సీసీ ఫుటేజ్ ఒకటి చూపించారు. అది చూసే మంత్రిగారు మండిపడిపోయారు. అసలేం జరిగిందో తేల్చాలని ఏసీబీ ఉన్నతాధికారులు ఒక విచారణ కమిటీ వేశారు.. అది ఇంకా నడుస్తోంది.
ఏసీబీ కేసుల గురించి పత్రికల్లో చూసినప్పడు ప్రజలు అధికారులు ఇంత అవినీతి చేశారా అంటూ నోరు తెరుస్తారు. ఆ తర్వాత ఆ అధికారి ఆ కేసు తప్పించుకోవడానికి చేయని ప్రయత్నం ఉండదు.. దింపని లీడరు ఉండరు. చిన్న కేసు అయితే.. విచారణ సరిగా జరపలేదంటూ ప్రభుత్వం ఒక జీవో ఇస్తే చాలు.. ఆ ఉద్యోగి బయటపడిపోతాడు. దీని కోసం భారీగానే పైరవీ జరిగి.. అదే అవినీతి డబ్బు చేతులు మారుద్ది. పెద్ద కేసు అయితే.. కనీసం కోర్టులో నిలబడకుండా చేయటానికి అధికారులను ఒత్తిడి చేసి.. తప్పించుకుంటారు. ఇది ఎప్పటి నుంచో తెర వెనుక జరుగుతున్న తతంగం.
అంతెందుకు.. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. ఏసీబీ వైన్ షాపుల వ్యవహారంపై విచారణ జరిపి.. రాజకీయనాయకులు, జర్నలిస్టుల తో సహా సిండికేట్ల బట్టలూడదీసింది. కాని ఆ రిపోర్టును బొత్స సత్యనారాయణకు బ్రేకులు వేయడానికి వాడుకుని.. తర్వాత బుట్టదాఖలు చేశారనే టాక్ అందరికీ తెలిసిందే.
ఏసీబీ డీజీగా ఆర్పీ. ఠాకూర్ పని చేసినప్పుడు.. చాలా దూకుడుగా వ్యవహారం నడిచింది. చాలామందిని పట్టుకున్నారు. కాని కొన్ని కులాలనే టార్గెట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఒక కులాన్ని మినహాయించారనే విమర్శలు చేశారు. కాని మొత్తం మీద ఆ వ్యవస్ధను అన్ని రకాలుగా బలోపేతం చేశారనేది మాత్రం వాస్తవం. చివరకు కేసులు పెండింగ్ లో పెట్టకుండా శిక్షలు పడేలా కూడా చూశారు.
ఒక క్రికెట్ బెట్టింగ్ కేసులో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఒక అధికారి బినామీ ఆస్తుల విషయంలో మరో ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డిని విచారణ చేశారు. అప్పటి నుంచే వైసీపీ ఠాకూర్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శల దాడి పెంచింది. ఆ తర్వాత డీజీపీగా అయ్యాక ఏమైంది.. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఎక్కడికి పంపించారో అందరికీ తెలిసిందే.
అయితే, వైసీపీ అధికారంలోకి రాగానే తమను అవినీతి కేసులో ఇరికించారంటూ రిక్వెస్టులు.. వాటిని మన్నించి జీవోలు విడుదల చేయటం పెరిగింది. జూన్ నెలలోనే ఆ జీవోలు ఉన్నాయంటే ఆశ్చర్యపోకండి. పైగా ఇంకా అనేకమంది తమపై అన్యాయంగా కేసులు పెట్టారు.. తమను తప్పించండి అంటూ ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డిగారిని కోరుతున్నారు. ఇవన్నీ ఏసీబీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు రెవెన్యూ మంత్రి ఓపెన్ కామెంట్స్ మరింత దారుణంగా దెబ్బ తీశాయి.
ఇంత జరిగినా, అవినీతి గురించి ఎప్పుడూ ప్రస్తావించే జగన్మోహన్ రెడ్డి … ఎక్కడా ఏసీబీని డిఫెండ్ చేసే ప్రయత్నం చేయకపోవడం.. కనీసం హోంమంత్రి కూడా స్పందించకపోవడం.. ఆఖరుకు డీజీపీకూడా ప్రకటన చేయకపోవడం దారుణమని ఏసీబీ అధికారులు కొందరు వాపోతున్నారు. అసలు ఒక కేసు పట్టుకోవాలంటే చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుందని.. చాలామంది బెదిరిస్తారని.. అన్నిటీనీ తట్టుకుని నిజాయితీగా పని చేస్తుంటే.. ఇలా నైతికంగా దాడి జరుగుతుంటే ఎవరూ ఆపటం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.