చట్టాలెన్ని ఉన్నా.. అవి వారికి చుట్టాలే. రూల్స్ రెగ్యులేషన్స్ సవాలక్ష ఉన్నా సరే.. రోడ్డు మీద తొక్కుకుంటూ వెళ్లిపోతారు. వీళ్లు చేసే తప్పులు కనపడుతున్నా.. గాంధీగారి మాట ప్రకారం చూడకుండా కళ్లు మూసుకుంటారు అధికారులు. అనవసరమైన ఆంక్షలు పని పాటా లేక పెట్టారులే అన్నట్లు.. అన్నీ లైట్ తీసుకుంటారు. పోలీసులు, రవాణాశాఖ అధికారులు ఇద్దరూ అన్నీ తెలిసినా, ఏమీ తెలియనట్లు బాగా నటిస్తారు. ప్రైవేటు ట్రావెల్స్ వారు తమ వ్యాపారంలో ఈ అధికారులకు కూడా తలాకాస్తా పడేస్తారు మరి. అప్పట్లో ట్రావెల్స్ అన్నీ తెలుగుదేశం వారివేనని.. అందుకే ఆపటం లేదని వైసీపీ వెయ్యిసార్లు ఆరోపించింది. ఆఖరుకు ఓ వివాదంతో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ బిజినెస్ కూడా వదిలేశారు.
కాని ఇప్పుడు ఒక్క దివాకర్ ట్రావెల్స్ తప్ప.. మరే బస్సును టచ్ కూడా చేయ్యటం లేదు. ఎందుకంటే.. అధికారం మారింది, వాటాదారులు మారారు అంతే.. వ్యాపారం మాత్రం ఆగలేదు.. మారలేదు. ప్రైవేటు ట్రావెల్స్ చట్టం ప్రకారం గ్రూపులకు తప్ప.. వ్యక్తులకు బుకింగ్ చేయకూడదు. కాని ఆన్ లైన్ సైట్లలో ఒక్కొక్కరికి బుకింగ్ చేస్తున్నా.. అది చట్టవిరుద్ధమని తెలిసినా కళ్లు మూసుకున్నారు అధికారులు. అదేమంటే వారు చెప్పే సమాధానం ఒకటే… రూల్స్ చాలా ఉంటాయండి. అమలు చేయాలంటే పై నుంచి చెప్పాలిగా అంటారు.
సరే ప్రభుత్వం మారింది కదా.. ఇక ప్రైవేటు ట్రావెల్స్ దుమ్ము దులుపుతారని అందరూ అనుకున్నారు. కాని చిత్రంగా కొత్త ప్రభుత్వం సైతం వారితో చేతులు కలిపింది. రవాణాశాఖా మంత్రి పేర్ని నాని అయితే చమక్కులు బాగా వదులుతున్నారు గాని.. అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు. కొన్నిసార్లు అధికారులు అయితే.. ప్రైవేటు ట్రావెల్స్ ఆపేస్తే.. జనం తిరగడం ఎలా? ఆర్టీసీ ఒక్కటే అందరికీ బస్సులు అందించలేదు అని సమాధానం చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఒకే పర్మిట్ తో రెండు మూడు బస్సులు నడుపుకుంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. అదేమంటే ఆధారముందా అంటారు. కాని రాష్ట్రంలోని టోల్ గేట్లలలో నమోదైన బస్సుల నెంబర్లు.. ఒకే రోజు టైమింగ్ తో సహా నమోదు చేసి చూస్తే.. అర్ధమైపోతుంది. ఒకే నెంబరు.. ఒకే రోజు డిఫరెంట్ ప్లేసుల్లో టోల్ గేట్లు దాటుతుంది..అంటే ఒకటే నెంబరు రెండు, మూడు బస్సుల మీద ముద్రించేసి.. ఒకే పర్మిట్ తో నడిపించేసుకుంటున్నారు. అయినా వీళ్లు ఎవరూ ఆపరు.
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ మీద చాలా ఆరోపణలున్నాయి. ఇప్పుడు వైసీపీ హయాంలో ఆ బస్సులను సీజ్ చేస్తున్నారు. ఆ సీక్రెట్ ఏంటో దివాకర్ రెడ్డి బయటపెట్టేశారు. ఇలా కేసులు పెటి.. మమ్మల్ని పార్టీలోకి రమ్మని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పేశారు. ఆయనే అడిగారు.. మరో ట్రావెల్స్ బస్సు ఒక్కటి కూడా ఆపలేదేంటి అని.. ఎందుకంటే ఆయనకు తెలుసుగా.. ఎన్ని లూప్ హోల్స్ తో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయో.
ఆర్టీసీ బరువు బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు కూడా ప్రైవేటు ట్రావెల్స్ విచ్చలవిడిగా తిరిగేస్తే.. ఆర్టీసీకి లాభాలు ఎలా వస్తాయి.. మళ్లీ నష్టాలు ప్రభుత్వానికి భారం పెంచుతాయి కదా అని ఓ ధర్మ సందేహం వచ్చింది. దానికి సమాధానం ఏంటంటే అసలు ఆర్టీసీ అతి త్వరలోనే సొంతంగా బస్సులు నడపదు. ఎలక్ట్రిక్ బస్సులన్నీ ప్రైవేటువే. మిగతావి కూడా ప్రైవేటు బస్సులే వచ్చేస్తాయి. అంతా ప్రైవేటు అయినప్పుడు, ఆర్టీసీ వ్యాపారం ఆగిపోతుంది. అధినేతలకు సరికొత్త వ్యాపారం దొరుకుతుంది అని ఆర్టీసీ యూనియన్ నాయకులు చెబుతున్నారు.