ముందు సైలైన్స్ మెయిన్ టెయిన్ చేశారు. ఆ తర్వాత రిక్వెస్టులు చేశారు. ఆ తర్వాత లాభం లేదని.. పైవారికి కంప్లయింట్ చేశారు. వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే.. రూల్ ప్రకారం దూకుడు చూపించారు. అది నచ్చని ప్రభుత్వం మండిపడింది.. ఆ తర్వాత వేటు వేసింది. అయినా కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేసి.. నాలుగున్నర నెలల తర్వాత మళ్లీ అదే సీట్లో కూర్చున్నారు. ఇప్పుడు ఇంటర్నల్ వార్ సైలెంట్ గా చేస్తారా లేక .. రూల్స్ దుమ్ము దులిపి.. తన దమ్మేంటో.. తనను ఇంతగా అవమానించిన ప్రభుత్వానికి చూపిస్తారా? లేక సెంటర్ నుంచి వచ్చే డైరెక్షన్ ప్రకారం ఫాలో అయిపోతారా? ఇదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.
నిమ్మగడ్డ రమేష్ కుమార్.. మళ్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత న్యాయం దక్కినట్లయింది ఆయనకు. ఈ కాలంలోనే ఆయనపై ఎన్నో విమర్శలు.. మరెన్నో సూటిపోటి మాటలు.. ఇంకెన్నో అవమానాలు.. అన్నిటినీ ఓపికగా భరించి.. న్యాయస్థానం ద్వారానే సమాధానం చెప్పారాయన. ఇప్పుడు ఆయన కేంద్ర హోంశాఖకు గతంలో రాసిన లేఖకు ఇంపార్టెన్స్ పెరిగింది. అందులో ఆయన వైసీపీ అనేక చోట్ల అరాచకాలకు పాల్పడిందని.. ఏకగ్రీవాలుగా ప్రకటించినవన్నీ ఏకగ్రీవాలు అవలేవని.. అలాగే ప్రతిపక్షాన్ని ఇరికించడానికి కొత్త చట్టాన్ని కూడా దుర్వినియోగం చేశారని.. ఇలా అన్ని ఉదాహరణలతో సహా వివరించారు. మరి ఇన్ని చెప్పిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు వాటన్నిటిపై చర్యలు తీసుకుంటారా? పైగా ఆయన ఎన్నికల కమిషనర్ గా తన విశేషాధికారాలను ఉపయోగించి.. కొందరు అధికారులను బదిలీ చేయాలని కూడా ప్రభుత్వానికి చెప్పారు. అది కూడా ప్రభుత్వం అమలు చేయలేదు.
స్థానిక ఎన్నికల నామినేషన్ల సమయంలో చోటు చేసుకున్న వ్యవహారాలపై కేసులు పెట్టించి.. ఆయా అధికారులపై చర్యలు తీసుకుంటారా? ఏకగ్రీవాలని ప్రకటించినవన్నీ రద్దు చేస్తారా? అసలు మొత్తం ఎన్నికల ప్రక్రియనే రద్దు చేస్తారా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నిర్దేశించిన సమయంలోపు ఎన్నికలు జరగకపోతే.. ఎన్నికల ప్రక్రియ రద్దవుతుంది. అలాగే ఎన్నికల నోటిఫికేషన్ కోసం ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు ఆర్డినెన్స్ జారీ చేసింది. మరి వాటి ప్రకారం ఏం చేస్తారనేది కూడా సస్పెన్స్. ఇప్పుడు జగన్ సర్కార్ కు రెండు సమస్యలు. ఒకటి ఆర్డినెన్సులు కాలపరిమితి అయిపోయిందని.. రెండుసార్లు ఇవ్వకూడదనే నిబంధనను ఫాలో అయితే.. ఎన్నికల నోటిఫికేషన్ రద్దయిపోతుంది.
అప్పుడు ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ అంతా వేస్ట్ అయిపోతుంది. కాని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎలాంటి అధికారాలు ఉండవు. అలా కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ అమలులోనే ఉంటే.. నిమ్మగడ్డకు అధికారాలు ఉంటాయి.. అప్పుడు ఎన్నికల ప్రక్రియను ఏం చేయాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఆయనకే ఉంటుంది. ఆయన ఏకగ్రీవాలపై విచారణ జరపాలనో.. లేక ఆయా అధికారులపై చర్యలు తీసుకోవాలనో.. లేక గొడవలు, బెదిరింపులు, కంప్లయింట్లు వచ్చిన చోట.. ఏకగ్రీవాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా.. ఇవన్నీ కూడా వైసీపీకి తీవ్ర నష్టం కలిగిస్తాయి.. ఎలాగూ ఇప్పుడప్పుడే ఎన్నికలు నిర్వహించే పరిస్ధితి లేదు.. ఒకవేళ నిర్వహించాలని వైసీపీ సర్కార్ భావిస్తే సరిపోదు… ఎన్నికల కమిషనర్ కూడా ఒప్పుకోవాలి. కాబట్టి ఎటు నుంచి చూసినా.. ఎలా చూసినా.. నిమ్మగడ్డ పునర్నియామకం జగన్మోహన్ రెడ్డికి కష్టాలే తెచ్చిపెడుతుంది. అందుకేనేమో.. శతవిధాలా ఎన్ని అవకాశాలుంటే.. అన్ని అవకాశాల ద్వారా.. దాన్ని అడ్డుకోవాలని చూశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఒకే ఒక మార్గం ఉంది.. అదే బిజెపితో ఉన్న అక్రమ సంబంధం.. ఒక వేళ దానిని ప్రయోగించి.. నిమ్మగడ్డపై కేంద్రం నుంచి సూచనల పేరుతో ఒత్తిడి తెస్తే.. వైసీపీకి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.