చీమ చీమ ఎందుకు కుట్టావంటే.. నా పుట్టలో వేలెడితే కుట్టనా అందంట. అలాగే ఆయనను మామూలు మాటలు అనలేదు. ఎన్ని రకాలున్నాయో.. అన్ని రకాలుగా వేధించారు. అవమానం చేశారు. సీనియర్ అని కూడ చూడకుండా తీసిపారేశారు. అయినా న్యాయపోరాటం చేసి.. తన పోస్టు తనకు మళ్లీ దక్కించుకున్నారు. ఇంత చేశాక.. ఆయన స్ట్రెయిట్ గా కాకుండా.. సర్కార్ వైపు ఎందుకు ఆలోచిస్తారు? ఆలోచించరు? ఇదే భయం వైసీపీని వెంటాడుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకగ్రీవాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై భయపడుతోంది. ఆ భయం నిజమైనట్ల కనపడుతోంది. అధికారిక ప్రకటన తప్ప.. మిగతా ప్రాసెస్ అంతా నిమ్మగడ్డ ఇఫ్పటికే పూర్తి చేశారని తెలుస్తోంది.
జస్ట్ కరోనాకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో మొదలయ్యాయి. ఎప్పుడు పోలింగ్ రోజు జరిగే హింస.. నామినేషన్ల రోజే మొదలైంది ఈసారి. డబ్బు కావాలంటే డబ్బు పారేశారు.. అయినా వినకపోతే బెదిరించారు.. అయినా లొంగకపోతే కిడ్నాప్ చేశారు.. అయినా దిగి రాకపోతే.. దాడులకు దిగారు.. ఏదో ఒక రకంగా.. ఆ స్థానం ఏకగ్రీవం అయిపోవాలి అంతే.. అదే లక్ష్యంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పని చేశారు. దాదాపు 2300 కు పైగా ఎంపీటీసీలు.. ఇంకా అదే రేంజ్ లో పంచాయతీలు ఏకగ్రీవాలయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు ఎంత గొడవ చేసినా.. నిమ్మగడ్డ మారుమాట్లాడలేదు.
కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేశాక.. కేంద్రానికి రాసిన లేఖలో.. నిమ్మగడ్డ మొత్తం వ్యవహారమంతా పేపర్ మీద పెట్టారు. దీంతో వైసీపీ అగ్గి మీద గుగ్గిలం అయింది. చంద్రబాబు తొత్తు అంటూ విరుచుకుపడ్డారు. ఇదంతా గతించిన చరిత్ర.. ఇప్పుడు జరగబోతుందేంటనేది ముఖ్యం.
స్వయంగా తానే అక్రమాలు జరిగాయని రాసి.. అధికారులు కుమ్మక్కయ్యారని చెప్పాక.. యాక్షన్ తీసుకోకపోతే ఎలా? అందుకే అవన్నీ లిస్టు రాసి.. కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపించారని తెలుస్తోంది. ఇప్పటికే నిబందనల ప్రకారం కూడా నోటిఫికేషన్ గడువు ముగిసిపోయింది. దీంతో మొత్తం ప్రక్రియ మొదలుకాడ్నించి మొదలెట్టాల్సిందేనని లైను రాసి పంపారని సమాచారం. మొత్తం ఏకగ్రీవాలన్నీ రద్దయ్యే విధంగా.. మళ్లీ నామినేషన్ల నుంచి మొత్తం మొదలెట్టే విధంగా చేయాలని.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతిపాదనను.. కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపారు. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. అదే ముక్క రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారని చెబుతున్నారు.
అంటే జగన్ భయపడినట్లే జరగబోతుందన్నమాట. మరి దీన్ని ఎలా ఎదుర్కోంటారో చూడాలి. రహస్య మిత్రుడు సోము వీర్రాజును రంగంలోకి దింపుతారో.. లేక బిజెపి అభ్యర్ధులను కూడా కొట్టారు కాబట్టి అది కుదరదని ఊరుకుంటారో.. లేక… కొత్త జిల్లాలు ఎటూ వస్తాయి కాబట్టి.. అవి వచ్చాక ఫ్రెష్ గా వెళ్లడానికి వైసీపీ కూడా సిద్ధపడిపోతుందో.. చూడాలి మరి.