వారంతా నాగుపాము ప్రమాదమని కర్ర పట్టుకుని చంపడానికి బయల్దేరారు. ఆ పామును పొలాల్లోకి రానివ్వకుండా అడ్డుకోవాలని చూశారు. కాటు వేస్తుందనే బెదిరింపులు వచ్చినా బెదరలేదు. ప్రాణాలు పోయినా సరే.. ఆ పామును అడ్డుకుంటామని.. తెగించి నిలబడ్డారు. వారికి అండగా పులి లాంటి మనిషి వచ్చాడు. మీరు చెప్పేది కరెక్ట్… పాము అంతం చూద్దామన్నాడు. అందరూ ఆ పులిని గౌరవించారు. పాము పారిపోయింది.. ఆ మనిషికి వీరంతా థ్యాంక్స్ చెప్పారు. వ్యవసాయమే కాదు.. అభివృద్ధి కూడా చేసుకుందామని అతనికి చెప్పారు. సడెన్ గా ఆ మనిషి మాయమై.. అనకొండ ప్రత్యక్షమైంది. నేను ఆ పామును మించినదానిని అని బుసలు కొట్టడం మొదలెట్టింది. పామును పరిగెత్తించినవారంతా.. ఈ అనకొండను చూసి నోరెళ్లబెట్టారు.. ఏంటీ నాటకం.. ఇన్నాళ్లు మన పక్కనే ఉన్నది అనకొండనా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.. ఏం చేయాలో అర్ధం కాక నిశ్చేష్టులైపోయారు.
వారెవరో కాదు మేధావులు. వడ్డే శోభనాద్రీశ్వరరావు, గాంధీ, ఐవైఆర్ కృష్ణారావు.. ఇంకా మరెందరో ఉన్నారు. వీరంతా అమరావతిలో పచ్చని పొలాలను రాజధాని కోసం తీసుకోవడాన్ని వ్యతిరేకించారు. కృష్ణానదీ తీరంలో వ్యవసాయాన్ని నాశనం చేయడాన్ని వ్యతిరేకించారు. అటవీ భూములను రాజధాని కోసం చూసుకోవాలని వారంతా సూచించారు. గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్లు వేశారు. రాజధాని నిర్మాణం ఆపాలని కోరారు. నదీ తీరంలో నిర్మాణాల పట్ల సైతం తీవ్రంగా అభ్యంతరాలు తెలియచేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమ నిర్మాణమైన లింగమనేని గెస్ట్ హౌస్ లో నివాసం ఉండటాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వాధినేతే అలా నిబంధనలకు విరుద్ధంగా వరద బేసిన్ లో కట్టిన కట్టడంలో నివాసముంటే.. ఇక అక్రమాలు ఎలా ఆగుతాయని నిలదీశారు. అయినా చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు. వీరంతా కలిసి సెమినార్లు నిర్వహించారు. రైతులను బెదిరిస్తున్నారని.. ప్రలోభపెడుతున్నారని.. వారంతా స్వచ్చంధంగా పొలాలు రాజధాని కోసం ఇస్తున్నట్లు కవరింగ్ చేస్తున్నారని వీరంతా ఆందోళన చేశారు. వీరికి వామపక్షాలు సైతం మద్దతిచ్చాయి.
ఉండవల్లి, పెనుమాక వంటి గ్రామాల రైతులు పొలాలు ఇవ్వడానికి నిరాకరిస్తే.. అధికారుల ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు పూనుకుంది. దీనిపై మేధావులంతా మీడియాకెక్కారు. జనసేనాని పవన్ కల్యాణ్ వచ్చేలా చేసింది.. వీరి కృషే. పవన్ వచ్చి మీటింగులు పెట్టి వెళ్లాక.. ప్రభుత్వ బెదిరింపులు ఆగాయి. అయినా తర్వాత భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి సైతం ఆ భూములు తీసుకోవాలని చూశారు.. అయినా రైతులు లొంగలేదు. ఈ మొత్తం ఎపిసోడ్లలో వారికి అండగా ఈ మేధావులంతా నిలిచారు. ప్రముఖ సామాజిక వేత్త మేధా పాట్కర్ ను పర్యటించేలా చేసి.. ఆమెతో కూడా ప్రకటనలిప్పించారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుకను కృష్ణానదీ తీరంలో తోడడాన్ని ఆపేలా ఉత్తర్వులు ఇచ్చేలా చేసి.. 100 కోట్లు ప్రభుత్వం ఫైన్ కట్టాలని చెప్పించేలా చేసింది కూడా ఈ మేధావులే. ఐవైఆర్ కృష్ణారావు అయితే ఓ పుస్తకమే రాశారు.ఈ మొత్తం ఉద్యమ ప్రయాణంలో.. వీరికి కొన్నిసార్లు ప్రత్యక్షంగా.. కొన్నిసార్లు పరోక్షంగా వైసీపీ సహకరించింది. జగన్మోహన్ రెడ్డితో సైతం వీరు భేటీ అయి.. అన్ని విషయాలు వివరించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ చాలా ఓపిగ్గా విని.. తప్పకుండా పోరాడాలని… తాను అండగా ఉంటానని చెప్పారు. రాజధాని అయితే ఆగలేదు.. నిర్మాణాలు ఆగలేదు.. రోడ్లు వేశారు.. కొన్ని భవనాలు కట్టారు.. ఈలోపు ఎన్నికలొచ్చాయి.. అధికారం మారింది. టీడీపీ ఓడింది.. వైసీపీ గెలిచింది. అప్పటికే మొదలన రాజధాని నిర్మాణాలను కొనసాగించి.. చంద్రబాబు ప్లాన్ ఛేసినట్లు.. కాకుండా.. దానిని తగ్గించి.. పరిపాలనకు అవసరమైన వరకు మాత్రమే నిర్మాణాలను చేయాలనేది మేధావుల అభిప్రాయంగా మారింది. మొదటి నుంచి వీరు రాజధాని ఈ ప్రాంతంలోనే (విజయవాడ) ఉండాలని.. భౌగోళికంగా అదే కరెక్టని చెప్పారు. కాని పచ్చటి పొలాలను రాజధాని కోసం వాడటాన్ని వీరంతా వ్యతిరేకించారు.
తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిలో నిర్మాణాలను ఆపేయటం.. కేవలం ప్రజావేదికను కూల్చి.. మిగతా నదీ తీర నిర్మాణాలను ఏమీ చేయకుండా వదిలేయటం.. ఇసుక మాఫియా మరింత పకడ్బందీగా నడుస్తుండటం.. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయారు. మూడు రాజధానుల పేరుతో.. అమరావతిని నిర్వీర్యం చేసి.. విశాఖలో పాలనా రాజధాని పెట్టడాన్ని వారంతా వ్యతిరేకిస్తున్నారు. కొందరు ఓపెన్ గా వస్తుంటే.. కొందరికి అయితే ఏం చేయాలో అర్ధం కాక మౌనం వహిస్తున్నారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్వతహాగా తెలుగుదేశం అయినా.. ఆయన చంద్రబాబు విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన మాట్లాడే మాటలను ప్రచురించిన జర్నలిస్టులకు టీడీపీ ఆఫీసు నుంచి ఫోన్లు కూడా వచ్చేవి. అలాంటిది నేడు ఆయన రాజధాని విశాఖలో పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు.. చంద్రబాబును మించి జగన్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐవైఆర్ కృష్ణారావు సైతం తన ట్విట్టర్ అకౌంట్లో తన నిరసన తెలియచేస్తున్నారు. అలా మేధావులంతా అమరావతిలో పొలాలను తీసుకోవడాన్ని వ్యతిరేకించగా.. వారి ఉద్యమాన్ని తన రాజకీయ లబ్దికి వాడుకున్న జగన్.. నేడు మాత్రం ఏకపక్షంగా విశాఖలో రాజధాని పెడుతున్నారు. చంద్రబాబు తమను అణచివేయడానికి ఫాలో అయిన విధానాలను చూసి తిట్టుకున్న మేధావులు.. అస్సలు పట్టించుకోని జగన్ వైఖరి చూసి విస్తుపోతున్నారు.