రీటెండరింగ్.. కోర్టు వ్యాజ్యాల మధ్య అసలు పోలవరం ప్రాజెక్టు ఎఫ్పుడు పూర్తవుతుందో స్పష్టత లేదు, పొరుగు రాష్ట్రంతో కలిసి గోదావరి జలాల్ని పంచుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ సీయం కేసీఆర్‌తో కలిసి చర్చలు జరిపి వచ్చారు. అందిన సమాచారం మేరకు ఏపీకి హక్కుగా వున్న గోదావరి మిగులు జలాలు రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా చేపట్టే భారీ ప్రాజెక్టు ద్వారా రెండు రాష్ట్రాలకు పంచుతారు. దీనిపై ఏపీకి వచ్చే ప్రయోజనాల విషయంలో అనేక అనుమానాలకు స్పష్టత ఇవ్వనేలేదు. విద్యుత్ బకాయిలు సహా ఉమ్మడి వివాదాల అంశాల గురించి ఏం తేల్చకుండా కేసీఆర్ ప్రతిపాదనలకు జగన్ ఊకొట్టి వచ్చేశారని ప్రతిపక్షాలు విమర్శల దాడి ఆరంభించాయి.
పోలవరం ప్రాజెక్టు పనుల పరిపూర్తికి ముందే బీడు వారిన కృష్ణా డెల్టా పొలాలకు సాగునీరు అందించేందుకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతలపై తీవ్రస్థాయిలో పోరాటాలు చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మరిన్ని ఎత్తిపోతల పధకాలు, పైపు లైన్ల ద్వారా గోదావరి నీటిని శ్రీశైలం వరకు పారించాలని ఒక అంగీకారానికి వచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య సాగు నీటి తరలింపు ప్రాజెక్టులు ఉమ్మడిగా చేపట్టిన దాఖలాలు దేశంలో ఇంతవరకు ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు కేసీఆర్, జగన్ చెబుతున్నట్టుగా రెండు రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో చేపట్టి ఈ ప్రాజెక్టును కనుక సాకారం చేయగలిగితే అది కొత్త చరిత్ర అవుతుంది. కాకపోతే, రెండు వేర్వేరు రాష్ట్రాల భూభాగాల మీదుగా ఒక నది నీటిని మరో నదికి అనుసంధానం చేయాలనుకోవడం జాతీయ ప్రాజెక్టు అయితేనే సాధ్యం అవుతుందని నిపుణులు అంటున్నారు. అసలు రెండు రాష్ఠ్రాలు కలిసి ఇలా ఉమ్మడిగా ఒక భారీ సాగునీటి ప్రాజెక్టును చేపట్టాలన్న ఆలోచనే సరికాదని, ఆచరణ సాధ్యం కానీ ఈ ప్రాజెక్టు తొందరపడి చేపడితే రానున్న కాలంలో ఇది వివాదాస్పదం అవుతుందని ఎంతమంది నిపుణులు, అనుభవజ్ఞులు చెబుతున్నా కేసీఆర్ మాటకు ఏపీ సీయం తలొగ్గుతున్నారని మరోపక్క విపక్షాలు మండిపడుతున్నాయి.
అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రాజెక్టు చేపట్టేందుకు ఏపీకి ఎంత మేర సానుకూలత వుందనేది కూడా గమనంలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉమ్మడి ప్రాజెక్టు చేపట్టాలంటే అందుకు భారీ భూసేకరణ జరపాల్సివుంది. కేసీఆర్ చెబుతున్నట్టు ఒకవేళ భూసేకరణకు వెళ్లకుండా పైపుల ద్వారా తక్కువ వ్యయంతో నీటిని తరలించాలని అనుకున్నా అది ఏ రాష్ట్ర భూభాగం నుంచి తరలించాలన్న ప్రశ్న ఎదురవుతుంది. తెలంగాణా భూభాగం నుంచి తరలించే ఆలోచన చేస్తే దానికి ఏపీకి న్యాయంగా దక్కాల్సిన వాటాను మధ్యలో అడ్డుకునే ప్రాజెక్టు కనుక ఇది ట్రైబ్యునల్ ఒప్పందాలు, అంతర్రాష్ట్ర జల పంపిణీ అంగీకారాలు, అనుమతులు, కేంద్ర జలవనరుల శాఖతో సంప్రదింపులు ఇతరత్రా అనేక అంశాలతో ముడిపడి వుంటుంది. అది అంత తేలికగా జరిగే తంతు కూడా కాదు. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు సయోధ్యతో కూడిన మంచి వాతావరణం వుంది కనుక ఈ ప్రక్రియ తేలిగ్గా పూర్తవుతుందని అనుకుంటే వివాదం లేదు. కానీ, పొరుగు రాష్ట్ర జల అవసరాలకు ఏపీకి రావాల్సిన నీటిని తరలించే ప్రాజెక్టు కనుక దానికి అయ్యే వ్యయం ఈ రాష్ట్రం ఎందుకు భరించాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ ఉమ్మడి ప్రాజెక్టుతో రాయలసీమ జిల్లాలకు కూడా గోదావరి నీటిని తరలించవచ్చునని కేసీఆర్ స్పష్టంగా చెబుతున్నారు కదా అని అనుకుంటే, సీమ జిల్లాల కోసమే అయితే పొరుగు రాష్ట్రంతో ఇక ఈ ఒప్పందాలు ఎందుకు? గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా పెన్నాకు గోదావరి-కృష్ణాజలాలను అనుసంధానానికి గతంలో ప్రతిపాదించిన మహాసంగమం ప్రాజెక్టు మాటేమిటి? దానినే చేపట్టవచ్చుగా.. ఆ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లాను మాగాణంగా మార్చవచ్చు, సీమ జిల్లాలకు సమృద్ధిగా నీటిని అందిచ్చవచ్చు కదా అనే ప్రశ్న వస్తుంది.
ఇలాకాకుండా శ్రీశైలం ప్రాజెక్టు వరకు గోదావరి జలాల తరలింపు ఏపీ భూభాగం నుంచి జరపాలంటే అందుకు అయ్యే భారం కూడా మనమెందుకు భరించాలి.? చేపట్టే ప్రాజెక్టు ఏదో మన రాష్ట్రంలోనే చేపడితే, మన జిల్లాలన్నీ మాగాణంగా మారుతాయి కదా.. అని నిపుణులు అంటున్నారు. వోవరాల్‌గా మాట్లాడుకోవాలంటే, సీమ జిల్లాలకు నీటిని అందిస్తమని పైకి చెబుతున్నా.. ఈ ఉమ్మడి ప్రాజెక్టు కేవలం తెలంగాణా రాష్ట్ర అవసరాల కోసం అనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సెంటిమెంట్ల కేసీఆర్ ఇక్కడ తెలియకుండానే మరో సెంటిమెంట్ ఒకటి రాజేశారు. ఆ సెంటిమెంటే రానున్నకాలంలో జగన్‌కు సమస్యగా మారే అవకాశం వుంది.
గోదావరి జలాల తరలింపు ప్రక్రియ కేంద్రం జోక్యం చేసుకుని చేపడితే.. అది వేరే విషయం. బహుశా జాతీయ ప్రాజెక్టు కనుక అప్పుడు అంతగా వివాదాలు తలెత్తకపోవచ్చు. అలాగాక, రెండు రాష్ట్రాలు కలిసి ఖర్చు భరించి ప్రాజెక్టు చేపట్డాలనుకుంటే మాత్రం అది కచ్చితంగా సెంటిమెంటుగా మారే అవకాశం వుంది. గతంలో జగన్ పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు గోదావరి జలాలను కృష్ణా అవసరాలకు తీసుకెళ్లిపోతున్నారని ఉమ్మడి గోదావరి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని టీడీపీ ప్రభుత్వం అప్పట్లో పదేపదే చెప్పేది. పట్టిసీమకు తరలించేది వరద జలాలు కాబట్టి, ఉభయ గోదావరి ప్రజానీకం దాన్నంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, ఇప్పుడు దిగువ ప్రాంతానికి న్యాయంగా రావాల్సిన నీటిని మధ్యలోనే అడ్డుకుని పైపుల ద్వారా, లేదా ఇతరత్రా మార్గాల ద్వారా వేరే రాష్ట్ర ప్రయోజనాల కోసం సీమ జిల్లాల పేరు చెప్పి తరలించాలని చూస్తే అది లేని పోని సెంటిమెంట్‌గా మారే ప్రమాదం వుంది. ఇప్పటికే గోదావరికి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటే ఏపీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జగన్ సర్కార్ కిమ్మనకుండా కూర్చుందనే విమర్శలు వున్నాయి. అందుకే తెలివిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి.. టీఆర్ఎస్ శ్రేణుల దృష్టిలో ‘వాడు మొగాడ్రా బుజ్జీ’ అనిపించుకున్నారు.
ఇక ఇక్కడ విషయానికి వస్తే… నిన్న జరిగిన భేటీలో గోదావరి నీటిని ఏ ప్రాంతం నుంచి తరలించినప్పటికీ.. ప్రాజెక్టు నిర్మాణాన్ని మాత్రం ఉమ్మడిగానే చేపట్టాలని రెండు రాష్ట్రాల సీఎంలు నిశ్చయించారు. నిర్మాణానికయ్యే వ్యయాన్ని రెండు రాష్ట్రాలు పంచుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని కూడా అనుకున్నారు. వీలైనంత తక్కువ భూ సేకరణతో, తక్కువ ఖర్చుతో, తక్కువ నష్టంతో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించారు. సోమవారమిక్కడ ప్రగతి భవన్‌లో ఇద్దరు సీఎంలూ సమావేశమయ్యారు. ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా జలాల తరలింపు, నీటి వినియోగం ఉండాలని నిర్ణయించారు. దీనికోసం ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలనుకున్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేలా గోదావరి జలాలను తరలించడమే ప్రధాన ధ్యేయమని.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలం దక్కేలా నిర్మాణాత్మక కార్యాచరణతో అడుగులు ముందుకు వేయాలని జగన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాలకు గోదావరి జలాలను ఎత్తిపోస్తే.. రాష్ట్రం నుంచి గోదావరి-పెన్నా అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టేందుకు వీలుంటుందన్నారు. గోదావరి జలాల ఎత్తిపోతకయ్యే స్పష్టత వస్తే.. రాష్ట్ర జల వనరుల శాఖ తమ ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందని తెలిపారు. దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను తరలించాలని నిర్ణయానికి వచ్చారు. అలైన్‌మెంట్ ఎలా ఉండాలో సమీక్షించారు. భూసేకరణ వ్యయం తక్కువగా ఉండేలా.. పైపులైన్ల ద్వారా గోదావరి జలాలను తరలించాలన్న ఆలోచనా వచ్చింది. దీనివల్ల ఆవిరి నష్టం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.