జనం దగ్గర చిల్లర వసూళ్లు చేయకండి. కాస్త ఆగండి. పైసలెలా సంపాయించాలో నేను చెబుతా కదా. ఇన్ కమ్ ట్యాక్స్ మాదిరి మనం డైరెక్టుగా పోకూడదు. జీఎస్టీ లాగా ఇన్ డైరెక్టుగా పోవాలి. ఏడ తీసుకున్నా అయన్నీ జనం పైసలే గందా. కాని జనానికి నొప్పి తెలియకుండా తీసుకోవాలే.. అదేదే గొప్ప కార్యక్రమం నడుస్తుందని వారనుకోవాలే.. తెర వెనక మన పని కానీయాలే.. అని ఒక పెద్దాయన చెప్పాడులేండి. అది ఇప్పుడు ఏపీలో మొదలైందనే టాక్ వినపడుతోంది.
మిషన్ బిల్డ్ ఏపీ.. పేరు బాగుంది కదా. కాని చేసే పనేంటంటే.. ఆస్తులు అమ్ముకోవడం. అంటే ఎవరైనా దివాళా తీశాకా, ఇక సంపాయించలేం.. అని తేల్చుకున్నాక.. ఆస్తులు అమ్ముకుని.. అప్పులు తీర్చుకుంటారు. కాని ఏపీ సర్కార్.. సంపాదన మార్గాల గురించి తర్వాత ఆలోచిద్దాం.. ముందు పని కావాలి కదా.. ఆస్తులు అమ్ముదామని డిసైడైంది. అందుకు మంచి పేరు వెదికి పెట్టుకున్నారు. ఈ మిషన్ బిల్డ్ కింద చేసేదేంటంటే.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములన్నిటిని అమ్మేయడం.. అమ్మగా వచ్చిన డబ్బులన్నీ ఖజానాలో వేసుకోవడం. ఇక్కడ కాగితం మీద చెప్పింది ఏంటంటే.. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఖర్చు పెడతామని.. అందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ బీ సీసీ తో ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణాలు చేస్తామని చెప్పారు. మంచిదే కదా.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటే కిక్ బ్యాకులుండవు.. నిర్మాణాలు కూడా క్వాలిటీగానే కడతారు. ఇంక సమస్య ఏముంది?
ఇక్కడే అసలు కిటుకు ఉందంటున్నారు కొందరు. ఈ మిషన్ వెనక రెండు మిషన్లు ఉన్నాయంట. ఒకటి తమకు కావాల్సిన ల్యాండ్ ను అధికార పార్టీ నాయకులు మేనేజ్ చేసి కొనుక్కోవచ్చు. వాళ్ల పేర్లు అక్కడ కనపడవు.. వెతికినా వేస్ట్. ఏదో ఒక పారిశ్రామికవేత్త, లేక ఏ కంపెనీ అధిపతి పేరు ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ దారుణంగా పడిపోయింది.. అదే పడేశారు. రేట్లు లేవు. ఈ సమయంలో పడిపోయిన రేటు పది రూపాయలుంటే.. పదకొండు రూపాయలకు కొంటారు. చూశారా.. రివర్స్ టెండరింగ్ ద్వారా లాభమొచ్చినట్లు.. ఇక్కడ ఒక రూపాయి ఎక్కువకే అమ్మాం అని చెప్పుకోవచ్చు.
రెండు తమ నేతల భూములున్న దగ్గర రియల్ బూమ్ పెంచడానికి ఈ స్కీమును వాడుకోవచ్చు. ఎలాగంటే.. అక్కడ పదికి బదులు ఇరవై పెట్టి కొంటారు. అంటే మార్కెట్ ఇరవైకి పెరుగుతుంది. అప్పుడు పక్కనే ఉన్న తమ భూముల రేట్లు కూడా ఇరవైకి పోతాయి.. లాభమే కదా. అదీ సంగతి.
ముందు యూనివర్శిటీల మీదే పడదామనుకున్నా.. ఎందుకో కాస్త వెనక్కి తగ్గారు. యూనివర్శిటీల వరకు మినహాయింపు ఇచ్చేశారు. ముందు విశాఖపట్నం, విజయవాడలోనే మొదలుపెడతారని తెలుస్తోంది. అనధికార సమాచారం ప్రకారం.. ఇప్పటికే లిస్టులు రెడీ అయిపోయాయి. రూలింగ్ పార్టీ లీడర్లు ఎక్కడ ఏది ఎంతకు అమ్మాలో.. అదే కొనాలో కసరత్తు చేస్తున్నారు. అన్నీ అయ్యాక.. అమ్మకాలు మొదలవుతాయి.
ఇప్పటికే టీడీపీ ఇది మరో రకం క్విడ్ ప్రోకో అని మండిపడుతోంది. వామపక్షాలు సైతం ఈ విధానంపై మండిపడుతున్నాయి. ఒక పక్కన పేదలకు ఇళ్ల స్ధలాల కోసం భూములు కొనాలి.. ఎక్కడున్నాయో చూడండని అధికారులకు ఆదేశాలిస్తూ.. అదే నోటితో అమ్మేయడానికి భూములు ఎక్కడ ఉన్నాయో చూడండని అంటున్నారు.. ఇదెక్కడి చోద్యమని కామ్రేడ్లు ప్రశ్నిస్తున్నారు. ఏ భూములు అమ్ముతారో లిస్టు బయటపడితే గాని.. జనంలో వేడి పుట్టదనిపిస్తోంది. అప్పుడుగాని.. ఇది అమ్మడానికి వీల్లేదు.. అది అమ్మడానికి వీల్లేదంటూ జనం రోడ్డెక్కుతారు. ఇక ఈ ఎపిసోడ్ ఏ రేంజ్ లో సాగుతుందో వేచి చూడాల్సిందే.