యూపీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతీరోజు చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అంతా ఊహించిన విధంగానే ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ కమలదళంలో చేరిపోయారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో ఆమెకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
గత కొన్ని రోజులుగా ఆమె బీజేపీలో చేరుతారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిని నిజం చేస్తూ ఇప్పుడు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. తనకు అన్నింటికంటే దేశం ముఖ్యమని అపర్ణ అన్నారు. తనకు అవకాశం ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. మోడీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతోందని.. ఆయన పనితీరు నచ్చి పార్టీలో చేరానని ఆమె చెప్పుకొచ్చారు.
ములాయం సింగ్ రెండో భార్యకు పుట్టిన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యావద్. ఆమె 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ తరపున పోటీచేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. గత కొంత కాలంగా ఆమె బీజేపీ విధానాలను సమర్థిస్తూ వస్తున్నారు. దీంతో ఆమె కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరిగింది.
యూపీలో గత కొంత కాలంగా బీజేపీ నుంచి ఎస్పీలోకి వలసలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎస్పీనుంచి అందులో అఖిలేష్ కుటుంబ సభ్యులు బీజేపీలో చేరడం.. కమలదళానికి ఊరటనిచ్చే అంశంగా రాజకీయ పండితులు చెబుతున్నారు. బీజేపీలో ఆమెకి సీటు కన్ఫాం అయినట్టు తెలుస్తోంది. కానీ.. ఎక్కడ నుంచి పోటీ చేస్తారని ఇంకా తెలియాల్సి ఉంది.