దోషులకు మరణ శిక్ష అమలు చేసేందుకు ఉరికాకుండా..తక్కువ బాధ కలిగించే ప్రత్యామ్నాయాల వైపు కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఉరి చాలా బాధాకరమైన ముగింపు అన్న ధర్మాసనం.. దీని కంటే తక్కువ బాధ కలిగించే మరణ శిక్ష అమలుపై చర్చలు ప్రారంభించాలని పేర్కొంది.
ఇందుకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని సేకరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై సమాచారంతో తిరిగి కోర్టుకు రావాలని అటార్నీ జనరల్ వెంకటరమణికి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఉరి శిక్ష పడ్డ ఖైదీలకు నొప్పి లేకుండా జీవితాన్ని ముగించే అవకాశం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం ఉరిశిక్షకు బదులుగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించింది.
ఉరిశిక్ష అమలు ప్రత్యామ్నాయాలపై నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న సర్వోన్నత న్యాయస్థానం.. తుపాకీతో కాల్చడం, ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం, విద్యుత్ కుర్చీ వంటి వాటిని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. ఉరి శిక్ష చాలా క్రూరమైనదన్న లా కమిషన్ నివేదికను పిటిషన్ తరపు న్యాయవాది రిషి మల్హోత్రా ధర్మాసనం ముందు చదివి వినిపించారు.
ఉరి శిక్ష క్రూరమైనదని అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం..దీనిపై తమకు కొంత శాస్త్రీయ సమాచారం కావాలని వ్యాఖ్యానించింది. ఉరి వల్ల కలిగే నొప్పి పై అధ్యయన సమాచారాన్ని ఇవ్వాలని అటార్నీ జనరల్ ను కోరిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దాని ఆధారంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.