కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ యోజనను తెలంగాణలో అమలుపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేంద్రం తెచ్చిన ఈ హెల్త్ స్కీమ్ లో కరోనా వైద్యం కూడా ఉందని, కానీ తెలంగాణలో ఆరోగ్య శ్రీ పేరిట ఆయుష్మాన్ భారత్ ను పక్కన పెట్టారని… అందులో కరోనా ఉచిత చికిత్స లేదని బీజేపీ నేత పేరాల శేఖర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ఆదేశాలివ్వాలని తన పిటిషన్ లో కోరారు.
దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు… తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు నోటీసులు జారీ చేస్తూ, రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలు చేయబోమని గతంలో పలుమార్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ పథకం కన్నా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం ఉత్తమమైందన్నారు.తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు కూడా ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరలేదు.