కోలివుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై అపోలో వైద్య బృందం తాజాగా మరో బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు సాయంత్రం ప్రకటన చేసింది.
రజనీకాంత్ ఆరోగ్యం స్థిరంగా ఉంది. కొన్ని వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటివరకూ నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆందోళనకర పరిస్థితి కనిపించలేదు. మిగిలిన రిపోర్టులు వచ్చిన తర్వాత ఆదివారం ( రేపు) రజనీకాంత్‌ను డిశ్ఛార్జి చేస్తామని బులెటిన్‌లో వెల్లడించారు.
ఈ నెలాఖరున రాజకీయ పార్టీని ప్రకటించే పనిలో బిజీగా ఉన్న రజనీకాంత్.. ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ కోసం ఈ నెల 13న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చారు. షూటింగ్ జరుగుతుండగానే.. సెట్‌లో కొందరికి కరోనా రావడంతో బ్రేక్ ఇచ్చారు. ఆయన పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం అ స్వస్థత అనిపించడంతో వెంటనే అపోలో ఆసుపత్రిలో చేరారు.