భారీగా జీఎస్టీ ఎగ్గొట్టిన మేఘా కృష్ణారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోరని కేంద్రాన్ని ప్రశ్నించింది ఆప్. ఈ విషయంలో ఏమన్నా ముడుపులు అందాయా? అని అనుమానం వ్యక్తం చేసింది. గన్ పార్క్ దగ్గర ర్యాలీ నిర్వహించారు ఆప్ నేతలు. అయితే.. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
బచావో తెలంగాణ పేరుతో ఇందిరా శోభన్ నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. కేసీఆర్ పేరుకు కొత్త అర్థం చెబుతూ బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శించారు నేతలు. కే అంటే కాళేశ్వరం.. సీ అంటే కరప్షన్.. ఆర్ అంటే రాజ అంటూ విమర్శలు చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు.
పోలీసులు ఆప్ నేతలను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అమరులకు నివాళులు అర్పించే స్వేచ్ఛ కూడా రాష్ట్రంలో లేదా? అని ప్రశ్నించారు ఇందిరా శోభన్. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
చీటికిమాటికి కేసీఆర్ ను జైల్లో వేస్తామని చెప్పడం తప్ప.. బీజేపీ చేసిందేమీ లేదన్నారు ఇందిరా శోభన్. రజత్ కుమార్ అంశాన్ని, కాళేశ్వరం అవినీతిని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం కమీషన్ల ప్రాజెక్టులుగా మారాయని ఆరోపించారు.
తెలంగాణలో ఉన్న అవినీతి పాలనకు చరమగీతం పాడదామని.. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో అంటూ పిలుపునిచ్చారు ఇందిరా శోభన్.