చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటింది. మొత్తం 35 మున్సిపల్ కార్పొరేషన్ లలో 14 సొంతం చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ లను వెనక్కి నెట్టి ఆప్ మొదటి స్థానంలో నిలబడింది. గతంలో 20 సీట్లు గెలుచుకున్న బీజేపీని ఇప్పుడు 12 సీట్లకు పరిమితమైంది. అటు, కాంగ్రెస్ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. శిరోమణి అకాలీదళ్ ఒక సీటు దగ్గర ఆగిపోయింది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి అనూహ్య ఫలితాలను కైవసం చేసుకుంది.
చండీగఢ్ సిట్టింగ్ మేయర్, బీజేపీ అభ్యర్థి రవికాంత్ శర్మపై ఆప్ అభ్యర్థి దమన్ప్రీత్ సింగ్ 828 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మాజీ మేయర్, బీజేపీ అభ్యర్థి దావేశ్ మౌడ్గిల్ను ఆప్ అభ్యర్థి జస్బీర్ 939 ఓట్ల తేడాతో ఓడించారు.
ఫలితాలపై స్పందించిన ఢిల్లీ సీఎం, ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ మార్పునకు ఇది సంకేతం అని అన్నారు. చండీగఢ్ ట్రైలర్ మాత్రమే.. పంజాబ్ అసలైన సినిమా ఉంటుందని ఆప్ నేతలు చెబుతున్నారు. పంజాబ్లో తమ పార్టీకి ఘనమైన స్వాగతం లభించిందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు.