సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ తన ఐఫోన్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. తమ తమ ఐఫోన్లను వినియోగదారులు మెడికల్ పరికరాలకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేసింది. పేస్‌మేకర్లు, డిఫైబ్రిలేటర్లు వంటి పరికరాలకు ఐఫోన్లను యూజర్లు దూరంగా ఉంచాలని తెలిపింది.
ఐఫోన్లలో ఉండే మాగ్నెట్‌లు, రేడియో చిప్‌లు ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఆ క్షేత్రాలు మెడికల్ పరికరాలపై ప్రభావం చూపిస్తాయి. అందువల్ల ఐఫోన్లను ఆయా పరికరాలకు దూరంగా ఉంచాలని యాపిల్ తెలియజేసింది. అయితే గతంలో వచ్చిన ఐఫోన్ల కన్నా ఇటీవల విడుదలైన ఐఫోన్ 12 మోడల్స్‌లో మాగ్నెట్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని మాగ్‌సేఫ్ యాక్ససరీలకు అనుగుణంగా రూపొందించారు. అందువల్ల వాటిల్లో మాగ్నెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే వాటి నుంచి మరింత ఎక్కువ విద్యుదయస్కాంత క్షేత్రం జనిస్తుందని, కనుక ఏ ఐఫోన్‌ను అయినా సరే మెడికల్ పరికరాలకు దూరంగానే ఉంచాలని యాపిల్ తెలిపింది. ఈ మేరకు యాపిల్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఐఫోన్లను కనీసం 6 నుంచి 15 ఇంచుల వరకు మెడికల్ పరికరాలకు దూరంగా పెట్టాలని యాపిల్ సూచించింది. ఇక మెడికల్ ఇంప్లాంట్స్ ఉండే వారికి దగ్గరగా ఐఫోన్లను ఉంచరాదని నిపుణులు తెలిపారు. దీంతోపాటు క్రెడిట్ కార్డులు, సెక్యూరిటీ బ్యాడ్జిలు, మాగ్నెటిక్ స్ట్రిప్‌లు, ఆర్ఎఫ్ఐడీ చిప్‌లు కలిగిన పరికరాలు, కార్డులకు కూడా ఐఫోన్లను దూరంగా పెట్టాలని, లేదంటే వాటిపై విద్యుదయస్కాంత క్షేత్ర ప్రభావం పడి ఆయా పరికరాలు దెబ్బ తినే అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు. కనుక ఆయా పరికరాలకు ఐఫోన్లను దూరంగా ఉంచితే మంచిది.