యాపిల్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. సంగీతం, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో కొత్త శకానికి నాంది పలికిన యాపిల్ ఐపాడ్‌ల ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దాదాపు రెండు దశాబ్దాలుగా సంగీత ప్రియులకు వీనుల విందు చేసిన ఐపాడ్ సిరీస్ మూగబోనుంది. చివరి వెర్షన్ ఐపాడ్ టచ్ ప్రస్తుతం అందుబాటులో ఉండగా.. వీటి ఉత్పత్తిని ఆపేస్తున్నట్టు యాపిల్ ప్రకటించింది. అయితే, స్టాక్ ఉన్నంత వరకు అమ్మకాలు జరుగుతాయి.
21 సంవత్సరాల క్రితం యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్.. ఐపాడ్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి వరకు వాక్‌మెన్‌లు, రేడియోలు, కంప్యూటర్లలో మాత్రమే సంగీతం వినగలిగేవారికి ఇది కొత్త అనుభూతిని అందించింది. నిజానికి ఆ కాలంలో ఐపాడ్ ఓ సంచలనం సృష్టించింది. అంతేకాదు, దాదాపు దివాలా దశకు చేరుకున్న సంస్థలో ఆర్థిక జవసత్వాలు నింపి.. ఇప్పుడు ప్రపంచంలోనే తొలిసారి మూడు ట్రిలియన్ డాలర్ల విలువను అందుకున్న కంపెనీగా నిలిపింది ఐపాడ్.
చేతిలో పట్టుకోగలిగే చిన్న ఎలక్ట్రానిక్ పరికరంలో 1000 పాటలనందించి సంగీత ప్రియుల చెవిలో సరిగమలు పలికించింది ఈ ఐపాడ్. కాలక్రమంలో యాపిల్ ఈ ఐపాడ్ కే ఫోన్ ఫీచర్లను జతచేసి ఐఫోన్‌ను తీసుకొచ్చింది. ఫలితంగా మ్యూజిక్ ఫీచర్లకు మాత్రమే పరిమితమైన ఐపాడ్‌కు ఆదరణ తగ్గిపోయింది. దీంతో 2014 నుంచే ఐపాడ్‌ల తయారీకి యాపిల్ ప్రాధాన్యం తగ్గించింది యాపిల్ సంస్థ.
ఐపాడ్‌లో ఇప్పటికి ఏడు వెర్షన్‌లు వచ్చాయి. చివరగా 2019 మే 28వ తేదీన ఐపాడ్ టచ్ విడుదలైంది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌ల ఆలోచనకు కూడా మూలం ఐపాడే. మొత్తంగా యాపిల్ చరిత్రలో ఐపాడ్‌లదే ప్రధాన పాత్రగా చెప్పవచ్చు. ఫోన్ ఫీచర్లు లేని ఐఫోన్‌గా ఐప్యాడ్‌ను ఇప్పటికీ చాలా మంది భావిస్తారు.
అయితే, ఐపాడ్‌ల అమ్మకాలు తగ్గేందుకు ఐఫోన్‌లే ప్రధాన కారణంగా మారాయి. ఎందుకంటే మ్యూజిక్‌తో పాటు అన్ని ఫీచర్లు ఐఫోన్‌లో ఉంటాయి. అలాగే ఎన్నో ఫంక్షన్స్ ఉంటాయి. అందుకే యాపిల్ ఫ్యాన్స్ క్రమంగా ఐఫోన్‌లకే మొగ్గుచూపారు. అలాగే ఇంటర్నెట్ ఖర్చు తగ్గడం, స్పాటిఫై, ప్రైమ్ మ్యూజిక్ లాంటి మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్‌లు రావడంతో ఐపాడ్‌లకు కష్టంగా మారింది.
ఐపాడ్ అన్ని వెర్షన్లు కలిపి దాదాపు 45కోట్ల డివైజ్‌లు అమ్ముడయ్యాయయని యాపిల్ అంచనా వేస్తోంది. మరోవైపు ఐపాడ్‌ల ఉత్పత్తిని ఆపేస్తున్నట్టు యాపిల్ ప్రకటించడంతో చాలా మంది సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. బైబై ఐపాడ్, రిప్ ఐపాడ్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.