ప్రపంచంలోనే అత్యధిక విలువ గల సంస్థగా యాపిల్ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ.. ‘బ్రాండ్ ఫైనాన్స్’ నివేదిక ప్రకారం 2022 సంవత్సరానికిగాను అత్యంత విలువైన సంస్థగా యాపిల్ అగ్రస్థానంలో నిలిచింది. బ్రాండ్ ఫైనాన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం యాపిల్ సంస్థ విలువ 355.1 యూఎస్ బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. ఈ విషయంలో చాన్నాళ్లుగా యాపిల్ ఆధిపత్యమే కొనసాగుతోందని చెప్పింది.
ఇక యాపిల్ తర్వాత.. అత్యధిక విలువ గల సంస్థగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రెండో స్థానంలో నిలిచింది. అమెజాన్ విలువ విషయానికి వస్తే 350.3 యూఎస్ బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు వెల్లడించింది.
మూడో స్థానంలో గూగుల్, నాలుగో స్థానంలో మైక్రోసాఫ్ట్ నిలవగా.. 5వ స్థానంలో వాల్ మార్ట్, 6వ స్థానంలో సాంసంగ్, ఏడవ స్థానంలో ఫేస్బుక్, ఎనిమిదో స్థానంలో ఐసీబీసీ, 9వ స్థానంలో హువాయి, పదవ స్థానంలో సంస్థలు అటు బ్రాండ్ ఫైనాన్స్ పేర్కొంది. మొత్తం టాప్ కంపెనీల్లో వరుసగా మొదటి ఐదు స్థానాల్లో అమెరికాకు చెందిన ఉండడం విశేషం.
ఇక మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన టిక్ టాక్ అత్యధిక వేగంతో అభివృద్ధి చెందుతోందని నివేదికలో చెప్పుకొచ్చింది. టెక్నాలజీ అత్యంత విలువైన రంగంగా ఉందని చెప్పిన బ్రాండ్ ఫైనాన్స్.. ఫార్మా రంగం వేగంగా వృద్ధి సాధిస్తున్నట్టు చెప్పింది. ప్రపంచ వాణిజ్య రంగంలో ఇప్పటికీ యూఎస్, చైనాల మధ్యనే ఆధిపత్య పోరు కొనసాగుతుందని బ్రాండ్ ఫైనాన్స్ అభిప్రాయపడింది.