ఇండియాలో చైనా ఉత్పత్తులపై పరోక్షంగా ఆంక్షలుండగా కొన్నింటికి మాత్రం మినహాయింపు లభిస్తోంది. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు గాను ఆ దేశ ఉత్పత్తులను మన దేశంలో బ్యాన్ చేయాలన్న డిమాండ్ ఉంది. అయితే భారత్ లో యాపిల్ కి ‘వెండర్స్’ గా సుమారు 12-15 చైనీస్ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ వీటికి సబంధించి దేశీయ విడిపరికరాలు లభ్యం కానందున మీరు ఇక్కడ వీటిని ఉత్పత్తి చేసుకోవచ్చునని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అంటే ఇండియాలో చైనీస్ ‘యాపిల్’ కి మినహాయింపు లభించింది. నిజానికి ఇప్పటికే ఇండియాలో ఉన్న చైనా కంపెనీల పట్ల ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. కానీ యాపిల్ విడిభాగాల విషయంలో కేంద్రం ‘ఉదారత’ ప్రదర్శించింది. ప్రత్యేక కేసుగా పరిగణించి మొత్తం యాపిల్ షేర్ హోల్డింగ్ ని అనుమతించాలని సర్కార్ నిర్ణయించింది.
కానీ చైనాకు సంబంధించిన ఇతర కొత్త సంస్థల విషయంలో ఇలాంటి సడలింపు దాదాపు అసాధ్యంగానే ఉంది. యాపిల్ విడిభాగాలను దేశీయంగా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యం ఉన్నప్పటికీ అది సాధ్యం కాదని తేలిపోవడంతో చైనీస్ వెండర్లకు అనుమతి లభించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
వీటిలో కొన్ని ఇప్పటికే ఇండియాలో ఓ మామూలు స్థాయిలో ఉన్నాయి. కానీ కేంద్ర నిర్ణయంతో ఇవి ఇక గణనీయంగా తమ ఉత్పాదక కార్యకలాపాలను ప్రారంభించవచ్చు. ఇండియా నుంచి ఫాక్స్ కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ వంటి కంపెనీలు లేటెస్ట్ ఐఫోన్లను తయారు చేస్తున్నాయి. చైనా యాపిల్ సంస్థకు అనుబంధంగా ఇండియాలో ఉన్న కంపెనీలు ముఖ్యమైన సాధనాలు, విడిభాగాలను సప్లయ్ చేయనారంభించనున్నాయి.