టెక్నాలజీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఒక పరికరానికి పలు ప్రయోజనాలను జోడించి వినియోగదారులకు అందిస్తున్నాయి ఆయా కంపెనీలు. సెల్ ఫోన్లో కెమెరాలు,గడియారాలు,కంపాస్ వగైరాలు అలాపొందుపరచినవే. వాచ్ లో కూడా అదే మాదిరి ప్రయోజనాలను నిక్షిప్తం చేస్తున్నారు.
వాచ్ లకు హెల్త్ ఫీచర్ల కూడా యాడ్ చేసి మార్కెట్‌లోకి దించుతున్నారు.ఈ క్రమంలో స్మార్ట్‌వాచ్‌లు యూజర్ల ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తూ అలర్ట్ చేస్తుంటాయి. యాపిల్ వాచ్ తాగాజా ఓ టీవీ రిపోర్టర్ కుమారుడి ప్రాణాలను కాపాడిన ఉదంతం వెలుగుచూసింది.
టీనేజర్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన విషయాన్ని పసిగట్టిన యాపిల్ వాచ్ అప్రమత్తం చేసింది. రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ 92 కంటే తక్కువగా ఉంటే ఆందోళనకరంగా పరిగణిస్తారు. ఆసమయంలో యూజర్లు వైద్యులను సంప్రదించాలని స్మార్ట్‌వాచ్‌లు సూచిస్తాయి.
సీబీఎస్ 8 యాంకర్ మార్కెలా లీ ఇటీవల తన కుటుంబంతో కలిసి అమెరికాలోని డెన్వర్ ట్రిప్‌కు వెళ్లారు. డిసెంబర్ చివరిలో ఆమె 16 ఏండ్ల కుమారుడు అస్వస్ధతకు లోనయ్యాడు. అతడి పెదవులు, గోళ్లపై నీలం రంగు మచ్చలు రావడంతో యాపిల్ వాచ్‌తో ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేయగా 66 నుంచి 77 మధ్య చూపాయి.
ఆపై ప్రొఫెషనల్ పరికరంతో చెక్ చేయగా యాపిల్ వాచ్‌లో వచ్చిన ఫలితం మాదిరే 67గా చూపింది. అతి ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో టీనేజర్ లంగ్స్‌లో హై అల్టిట్యూడ్ పల్మనరీ ఒడెమాను వైద్య బృందం గుర్తించింది. అతడి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కుదురుకునేందుకు టీనేజర్‌కు ఆక్సిజన్ అందించారు.
ఇక తన కుమారుడి హార్ట్ రేట్ యాపిల్ వాచ్ రీడింగ్‌కు అనుగుణంగానే నిమిషానికి 130 బీట్స్‌గా నమోదైందని ఆమె చెప్పుకొచ్చారు. తన కుమారుడి ఆరోగ్య పరిస్ధితి ఇప్పుడు నిలకడగా ఉందని, తాము మరొక రోజు వైద్య సాయం పొందలేకుంటే అతడు కోమాలోకి వెళ్లేవాడని లీ ఆందోళన వ్యక్తం చేశారు.