మద్రాస్ హైకోర్టు జడ్జిగా వివాదాస్పద లాయర్ లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై మంగళవారం విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. నిజానికి దీనిపై ఈ నెల 10 న విచారించాలని దీన్ని లిస్టులో పెట్టినప్పటికీ తిరిగి పరిశీలించి రేపే విచారించాలని కోర్టు నిర్ణయించడం విశేషం. ఈమెను మద్రాస్ హైకోర్టులో అదనపు జడ్జిగా నియమిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ను సీనియర్ లాయర్ రాజు రామచంద్రన్ కోర్టు దృష్టికి తెచ్చారు.
లాయర్ గా ఉన్న గౌరి బీజేపీకి అనుకూలమన్న వాదన తలెత్తడంతో ఆమె నియామకం వివాదాస్పదమైంది. ముస్లిములు, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా లోగడ ఆమె చేసిన వ్యాఖ్యలు పతాక శీర్షికలకెక్కాయి. ఆమె విద్వేష పూరిత ప్రసంగాలు చేసిందని, ఇలాంటి వ్యక్తిని అదనపు జడ్జిగా నియమిస్తూ కొల్లీజియం చేసిన సిఫారసును రీకాల్ చేయాలని మద్రాస్ హైకోర్టుకు చెందిన కొంతమంది బార్ సభ్యులు సీజేఐకి లేఖ రాశారు.
దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీ.ఎస్. నర్సింహ, జస్టిస్ జెబి. పరిద్వాలా స్పందిస్తూ.. దీన్ని అత్యవసరమైనదిగా పరిగణిస్తున్నామని, మంగళవారమే దీని విచారణకు బెంచ్ ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
వివాదాస్పదమైన ఓ సీనియర్ లాయర్ ని న్యాయమూర్తిగా నియమించడం, దీనిపై దాఖలైన పిటిషన్ మీద సుప్రీంకోర్టు అత్యవసరంగా విచారణ చేబట్టడం బహుశా ఇదే మొదటిసారని అంటున్నారు.