ఉన్నట్టుండి మనుషులు కుప్పకూలుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా హఠాన్మరణం పొందుతున్నారు. ఇటీవల తరుచూ ఇవే సంఘటనలు చోటుచేసుకుంటుండడం అందరనీ కలచివేస్తోంది. ఇలా అకస్మాత్తుగా కూలుతున్న వారిని ఆదుకునేది సీపీఆర్ విధానం. ఆపత్కాలంలో ప్రాణం నిలిపేది సీపీఆర్.
ఇటీవల హైదరాబాద్ లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఇక సంఘటన తరువాత పోలీసు డిపార్ట్ మెంట్లో సీపీఆర్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. తాజాగా మరో కానిస్టేబుల్ సీపీఆర్ విధానంతో మరొకరి ప్రాణం కాపాడాడు.
ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. రేగొండ మండల కేంద్రంలోని ఓ చికెన్ సెంటర్ లో వంశీ పనిచేస్తుంటాడు. పనులు ముగించుకొని బుధవారం అర్థరాత్రి బయటకు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు.
అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోవడంతో అక్కడే సమీపంలో విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ కిరణ్ వెంటనే స్పందించాడు. వంశీకి సీపీఆర్ నిర్వహించాడు. దాదాపు 15 నిమిషాల పాటు అతడిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాడు. సీపీఆర్ చేయడంతో వంశీ అపస్మారక స్థితి నుంచి తేరుకొని తిరిగి శ్వాస తీసుకున్నాడు. దీంతో స్థానికులంతా ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వెంటనే వంశీని ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు.