దేశభద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లద్దాఖ్ లోని సరిహద్దు ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి షింకున్ లా సొరంగాన్ని నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య 4.1 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది.
నిమూ పదామ్ దార్చా రోడ్డు లింక్ లో 1,681 కోట్ల వ్యయంతో ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయనుంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో లద్దాఖ్ కు సులువుగా చేరుకోవడానికి ఈ టన్నెల్ ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని చెప్పారు.
లద్దాఖ్ లోని షింకుల్ లా సొరంగ మార్గం ప్రణాళికను 2021 మే లో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ముందుగా చిన్న సొరంగాన్ని ప్రతిపాదించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్.. ఆ తర్వాత 12.7 కిలోమీటర్ల టన్నెల్ కనెక్టివిటీని ప్రతిపాదించింది. చివరకు 4.1 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
అయితే చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో లద్దాఖ్ కు ఏ స్థితిలో అయినా చేరుకోవడానికి ఈ చిన్న సొరంగం ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కేంద్రం ఆమోదం తెలిపింది. ఇక సరిహద్దుల్లో ప్రస్తుతం తొమ్మిది టన్నెల్స్ నిర్మాణంలో ఉన్నాయి. అరుణాచల్ లోని తవాంగ్ కు వ్యూహాత్మక 2.5 కిమీ సెలా టెన్నల్ ను 687 కోట్లతో 13,000 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు.