సీబీఐ విచారణలో ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో డొంక కదులుతోంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో మరికొన్ని రోజుల్లో నిజాలు తేలనున్నాయని, నిజాలు బయట పడే రోజు దగ్గర పడిందన్నారు. ఇంత కాలం దస్తగిరి చెప్పింది అబద్దమని కొందరు అన్నారని.. తాను చెప్పిన నిజాలు ఏమిటో ఇక తెలుస్తాయని బాంబు పేల్చారు దస్తగిరి.
అయితే ఈ మధ్య కాలంలో కొందరిని సీబీఐ అధికారులు విచారించారంటే సమాచారం ఉంటేనే కాదా విచారణకు పిలిచి ఉంటారని దస్తగిరి అన్నారు. రాష్ట్రంలో విచారణకు సీఎం జగన్ సహకరించి ఉంటే పది రోజుల్లో కేసు పూర్తి అయ్యేదన్నారు. తెలంగాణకు కేసు బదిలీ చేయడం మంచిదేనన్నారు. హైదరాబాద్ కోర్టుకు హాజరయ్యేందుకు సమన్లు తీసుకునేందుకు సీబీఐ ఎదుటకు వచ్చానని దస్తగిరి పేర్కొన్నారు. కాగా వివేకా హత్య కేసుపై సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.
సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు నిందితులందరికీ సమన్లు జారీ చేశారు. ఈనెల 1వ తేదీన హాజరు కావాలని హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆదేశించింది. దీంతో ఛార్జ్ షీట్ లోని ఐదుగురు నిందితులకు ఈ మేరకు సమన్లు జారీ చేశారు. కడప సెంట్రల్ జైలులో ఉన్న సునీల్, దేవి రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డిలకు సమన్లు జారీ అయ్యాయి. అలాగే అప్రూవర్ గా మారిన ఏ 4 నిందితుడు దస్తగిరికి సీబీఐ అధికారులు సమన్లు అందజేయనున్నారు.
మరో వైపు ఏపీ సీఎస్ వ్యవహార శైలిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ సొంత బాబాయ్ హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులను వెంటబెట్టకొని మరీ తాడేపల్లికి సీఎస్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక వైఎస్ వివేకా హత్య రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కి పడేలా చేసింది.