ఏపీలో సర్కార్- ఎన్నికల సంఘం మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. కమిషన్ ముందు వెంటనే హాజరు కావాలంటూ సీనియర్ ఐఏఎస్ లు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ లను ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన ఈ ఇద్దరు పంచాయితీరాజ్ అధికారులపై కమిషనర్ నిమ్మగడ్డ సీరియస్ గా ఉన్నారు.
ఈనెల 27న వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ముఖ్యమైన అధికారులతో కలిసి మళ్లీ తమ వద్దకు రాలేదని, ఎన్నికల నిర్వహణలో పూర్తిస్థాయి సహకారం అందించటం లేదని నిమ్మగడ్డ మండిపడుతున్నారు. ఆన్ లైన్ నామినేషన్ల విషయంలో ఈ ఇద్దరు అధికారులు సరిగ్గా స్పందించలేదని, అందుకే ఆన్ లైన్ నామినేషన్లు తీసుకోలేకపోతున్నామని నిమ్మగడ్డ ఫైర్ అయ్యారు. దీంతో ద్వివేది, గిరిజా శంకర్ లు ఆయన్ను కలిశారు.
మరోవైపు సీనియర్ ఐఎఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అంశంలో తమ ఆదేశాలను సీఎస్ భేఖాతరు చేయటంపై కమిషన్ హైకోర్టును ఆశ్రయించనుంది. హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎంవో ముఖ్యకార్యదర్శితో పాటు జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్… ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని,ఆయన్ను బదిలీ చేయాలని కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ తను ఎన్నికల విధుల్లో లేనందున తనను బదిలీ చేసే అధికారం కమిషన్ కు లేదని సీఎస్ స్పష్టం చేశారు.