గత కొన్ని రోజులుగా మంత్రి పెద్దిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్న ఆయన ఇటు అధికారులను కూడా బెదిరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తున్న తరుణంలో… ఎస్ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈనెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని, మీడియాతో కూడా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ ను ఆదేశించారు. వైసీపీలో జగన్ తర్వాత కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా ఉండే మంత్రి పెద్దిరెడ్డిని నిలువరించేందుకు ఆయన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది.
మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ఏకగ్రీవాల విషయంలో ఎస్ఈసీ నిర్ణయాలను అధికారులు పాటించవద్దని, అలా అయితే ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెడుతుందంటూ వ్యాఖ్యానించారు.
ఎస్ఈసీ నిర్ణయంపై వైసీపీ సీరియస్ గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మంత్రిగా తన కర్తవ్యాలను అడ్డుకోవటమే ఇది అని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.