తన పాలనలో పారదర్శకతకే పెద్దపీట వేస్తానని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మొదటి నుంచి చెబుతూనే వున్నారు. ఏ స్థాయిలోనూ అవినీతిని అస్సలు సహించేది లేదన్నసంకేతాలను అటు కేబినెట్ సహచరులకు, ఇటు అధికారులకు పదేపదే పంపిస్తున్నారు. అవినీతి ఆరోపణలు వచ్చిన కొందరు ప్రజాప్రతినిధులకు స్వయంగా ఫోన్ చేసి హెచ్చరికలు జారీచేశారు. వోవరాల్‌గా జగన్ అవినీతి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని జనమైతే బాగా నమ్మేశారు. కానీ, ఐటీ శాఖలో ఇప్పుడు జరుగుతున్న తతంగం ఏంటో…
గుంటూరు: కొందరు అధికారులు తమ పాత వాసనను వదుల్చుకోలేకపోతున్నారు. ఐటీ శాఖలో సరికొత్త స్కామ్‌కు అధికారులు తెరలేపారు. ఒకవైపు జగన్మోహనరెడ్డి టెండర్ల విషయంలో ఎక్కువమంది పాల్గొనేలా చూడాలని, ప్రభుత్వానికి ఆదా, ఆదాయం తీసుకురావాలని అధికారులకు పదేపదే సూచిస్తున్నారు. ఇది ఐటీ శాఖలో పనిచేస్తున్న అధికారులకు ఏమాత్రం పట్టలేదు.
యువతకు నిరుద్యోగ నిర్మూలనపై ఇచ్చిన హామీల్లో భాగంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా అవినీతికి, అక్రమాలకు ఆస్కారం లేకుండా రికార్డు స్థాయిలో 2 వారాల్లోపే పరీక్షను నిర్వహించి, దాని ఫలితాలను కూడా వెల్లడించి తన మార్క్ చూపించారు వైఎస్ జగన్. ఐటీలో పనిచేసే కొందరు అవినీతి అధికారులు దీన్నే ఒక అవకాశంగా మలుచుకున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం సమకూర్చాల్సిన కంప్యూటర్ సామాగ్రి కొనుగోలు అవసరాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వీళ్లు తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. సుమారు రూ.150 కోట్ల విలువైన ఈ కంప్యూటర్ పరికరాల కొనుగోలు బాధ్యతను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ డిపార్టుమెంటుకు అనుబంధంగా ఉన్న ఏపీటీఎస్ (ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్)కు అప్పగించారు. ఇదే శాఖలో నిన్నా మొన్నటివరకూ ఉన్నత స్థాయిలో పనిచేసిన ఓ అధికారి, అతని అనుచరుల వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం రాబోతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
సచివాలయాల్లో ఉద్యోగుల అవసరాల కోసం రూ.150 కోట్ల విలువైన 28 వేల కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని కొనుగోలు చేయాలని 2 నెలల క్రితం ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఏపీటీఎస్‌లో ఇంతకుముందు వరకు కీలక బాధ్యతలు చూసిన ఓ అధికారి ఈ కంప్యూటర్ల కొనుగోలు టెండర్లలో కేవలం 2 కంపెనీలకు మాత్రమే అవకాశం కల్పించి, ఆ సంస్థల పట్ల తన సహృదయాన్ని చాటుకున్నారు. ప్రధానంగా మైక్రోకేర్, అక్షర అనే ఈ రెండు సంస్థలకే టెండర్లలో పాల్గొనే విధంగా అవకాశం కల్పించి ఇతర కంప్యూటర్ సంస్థలకు మొండిచేయి చూపారు. ప్రస్తుతం ఏపీటీఎస్‌కు కొత్తగా అపాయింట్ అయిన ఐఏఎస్ అధికారి చుట్టూ తిరిగినా, ఆ సంస్థలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. అయితే ఆ చక్రం తిప్పిన పాత అధికారి గత ప్రభుత్వంలోనూ అదే శాఖలో పనిచేయటం, అప్పుడు కూడా ఈ రెండు సంస్థలకే టెండర్లు వచ్చే విధంగా సహకరించటం అందరికీ తెలిసిందే. జగన్ ప్రభుత్వంలో కూడా ఈ పాత కాపులే ఇక్కడ కాపుకాసి తమ అనుయాయులకు కాంట్రాక్టు దక్కేలా ప్రయత్నిస్తున్నారు. ఇది జగన్ ఆదేశించిన లక్ష్యాలను నీరుగార్చే విధంగా ఉందని టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం తగ్గని వేరే సంస్థలు వాపోతున్నాయి. ఇప్పటికైనా రూ.150 కోట్ల విలువైన ఈ కంప్యూటర్ల కొనుగోలు టెండర్ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించి సమీక్షించాల్సిన అవసరం ఉంది. ముందుగా ప్రకటించిన విధంగా అర్హులైన వారి ప్రపోజల్స్‌ను పరీశించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. మరి ఐటీ శాఖలో నెలకొన్న తాజా వివాదాన్ని పరిష్కరించడానికి రివర్స్ టెండర్ విధానాన్నిఫాలో అవుతారా? జగన్ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో వేచిచూడాలి.