కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం అంతా ఎదురుచూస్తున్న తరుణంలో… పలు దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ వచ్చేసింది. దీంతో చాలా మంది ఊపిరిపీల్చుకుంటున్న దశలో ప్రపంచ వ్యాప్తంగా ముస్లీంలు ఈ వ్యాక్సిన్ వాడతారా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ కరోనా వ్యాక్సిన్ లో పంది మాంసపు అవశేషాలుండటే ఇందుకు అసలు కారణం.
వ్యాక్సిన్స్ లో పంది జెలటిన్ ను వాడుతుంటారు. ఈ జెలటిన్ వల్ల వ్యాక్సిన్ రవాణా, స్టోరేజ్ లలో ఇబ్బంది ఉండకుండా చూడటంతో పాటు వ్యాక్సిన్స్ సేఫ్ గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. కొన్ని మందుల తయారీదారులు ఇందుకు ప్రత్యామ్నాయంగా చేపల జెలటిన్ కూడా వాడుతుంటారు. కానీ వ్యాక్సిన్స్ తయారీదారులు నాణ్యత విషయంలో పంది జెలటిన్ వైపే మొగ్గుచూపుతుంటారు.
ఈ కరోనా వ్యాక్సిన్ వాడకంపై ముస్లిం వర్గాల్లో ఉన్న అనుమానాల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ -యూఏఈ అత్యున్నత ఇస్లామిక్ అథారిటీ కోవిడ్-19 వ్యాక్సినేషన్‌పై మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఫత్వా కౌన్సిల్స స్పందించింది. కౌన్సిల్ చైర్మన్ షేక్ అబ్ధుల్లా బిన్ బయ్యా మాట్లాడుతూ… కరోనా వైరస్ వ్యాక్సిన్లు ఇస్లాం పోర్క్ ఆంక్షల పరిధిలోకి రావన్నారు. మనిషి ప్రాణాన్ని కాపాడటం అత్యంత ముఖ్యమైన అవసరమని, వ్యాక్సిన్లలోని పోర్క్ జిలటిన్‌ను మందుగా పరిగణించాలన్నారు. దానిని ఆహారంగా చూడకూడదన్నారు. యావత్తు మానవ సమాజానికి తీవ్ర నష్టం కలిగించే, అత్యంత వేగంగా విస్తరించే వైరస్‌పై వ్యాక్సిన్లు తీసుకోవటం మంచిదని ఆయన స్పష్టం చేశారు.