అరణ్యకృష్ణ, రాజకీయ విశ్లేషకుడు
ఇద్దరు సమ ఉజ్జీల మధ్య జరిగేదాన్ని యుద్ధం అనొచ్చేమో కానీ బలాబలాల దృష్ట్యా ఇద్దరు అసమానుల మధ్య జరిగేదాన్ని యుద్ధం అనలేం. బలవంతుడు బలహీనుడి మీద చేసే దాడిగానే దాన్ని గుర్తించాలి. ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసిందనాలే కానీ రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతున్నది అనకూడదని నా అభిప్రాయం. అలాగని బలహీనుడు ఏ తప్పూ చేయడని, న్యాయం ఎల్లవేళలా బలహీనుడి వైపే వుంటుందని కూడా అనలేం. బలహీనుడు మరో బలవంతుడి చేతిలో పాచికలా మారినప్పుడు కూడా దాడికి గురవుతాడు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ల మధ్యనున్న ఉద్రిక్తతలని వివరించడానికే ఇదంతా చెప్పడం.
ఎలాంటి సంశయం లేకుండా ఉక్రెయిన్ మీద రష్యా దాడిని ఖండించొచ్చు. మరో దేశం సార్వభౌమత్వాన్ని అవమానపరిచి, అంతర్జాతీయ సూత్రాలను గాలికొదిలేసి, దౌత్య విధానాల ద్వారా సమస్యని పరిష్కారం కోసం ప్రయత్నించకుండా దాడి చేయడాన్ని సమర్ధించలేం. కానీ ఇందులో రష్యాని మాత్రమే “అక్యూజ్డ్” (నిందితుడు)గా చూడాలా అనేదే నా ప్రశ్న. అంతా ప్రశాంతంగా వున్న ఉక్రెయిన్ మీదకి రష్యా నేరుగా వెళ్లిపోయి దాడులు చేస్తున్నదా? ఈ పరిణామానికి ముందున్న పరిణామక్రమం ఏమిటనేది ఆలోచించాలి.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అలుముకున్న ప్రఛ్ఛన్న యుద్ధ వాతావరణంలో సోవియెట్ వ్యతిరేక మిలిటరీ అలయెన్స్ “నాటో” కూటమి సోవియెట్ పతనానంతరం కూడా కొనసాగింది. అసలు దాన్ని కొనసాగించే ఆవసరం ఏమున్నది? పైగా 1989 నుండి అనేకసార్లు రష్యా-అమెరికా చర్చల ద్వారానూ, ఒప్పందాల ద్వారానూ నాటో రష్యా భద్రతకి ముప్పు తెచ్చే విధంగా వ్యవహరించదని, రష్యా పొలిమేరల దేశాలకి నాటో సభ్యత్వం ఇవ్వదని, తూర్పు యూరోప్ వైపు నాటో విస్తరించదని హామీలు, ఒప్పందాలు కుదిరాయి.
1989లో గోర్బచెవ్-అమెరికా విదేశాంగ మంత్రికి మధ్య జరిగిన చర్చలు, 1990లో ఓ.ఎస్.సి.ఇ. (పారిస్ చార్టర్) ఒప్పందం, 1994లో నాటో-రష్యా ఒప్పందం, 1997లో నాటో రష్యన్ ఫౌండేషన్ యాక్ట్ వంటివి ఇందుకు ఉదాహరణలు. కానీ అమెరికా వాటిని తుంగలో తొక్కింది. సోవియెట్ యూనియన్ కుప్పకూలిన తరువాత కూడా సోవియెట్ మిత్ర దేశాలైన చెక్ రిపబ్లిక్, హంగెరి, పోలాండ్ వంటి తూర్పు యూరొప్ దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 13 పాత సోవియెట్ రిపబ్లిక్స్ దేశాలు నాటో సభ్యత్వాన్ని కలిగివున్నాయి. వాటిలో నాటో సేనలు కూడా తిష్ట వేసి వున్నాయి. అప్పుడు రష్యా వ్యతిరేకించినా బలహీనంగా ఉండటంతో ఏమీ చేయలేక పోయింది. ఒకప్పటి సోవియెట్ యూనియన్లో భాగస్వామై వుండి, రష్యాతో సరిహద్దులు పంచుకుంటూ ఇప్పుడు స్వతంత్ర దేశంగా వున్న ఉక్రెయిన్ కు నాటో కూటమిలో సభ్యత్వం ఇప్పించాలని అమెరికా చూస్తున్నది. ఇంతకుముందు 2009లో జార్జియాకు నాటో సభ్యత్వం ఇప్పించాలని చూసినప్పుడు అప్పటికి కొంత పుంజుకున్న రష్యా అడ్డుకోగలిగింది. ఈ రెండు దేశాలతో రష్యాకున్న పేచీలను తనకు అనుకూలంగా వాడుకోడానికి అమెరికా ప్రయత్నిస్తూ వస్తున్నది.
సోవియెట్ యూనియన్ విచ్చిన్నమై, రష్యాలో సోషలిస్టు వ్యవస్థ పడిపోయి ఆర్ధికంగా చితికిపోయిన రష్యాను ఒక గాడిన పెట్టినవాడిగా పుతిన్ పట్ల రష్యా ప్రజల్లో విశ్వాసం వుంది. తనకు తిరుగులేని విధంగా అధికారాల్ని కట్టపెట్టే విధంగా రాజ్యాంగాల్ని సవరించినప్పటికీ, ప్రతిపక్ష నేతల పట్ల నియంతృత్వ వైఖరితో వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన హవా తగ్గడం లేదు. ఆ ధైర్యంతోనే ఆయన అమెరికా కనుసన్నల్లో మెలుగుతున్న ఉక్రెయిన్ కి గుణపాఠం నేర్పించాలనుకొని 2014లో ఉక్రెయిన్లో రష్యన్లు అధికంగా నివసించే క్రిమియా ప్రావిన్స్లో స్థానిక రష్యన్ మూలాలు కలిగినవారిపై అమలౌతున్న జాతి వివక్షకి వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాట్లని ప్రోత్సహించి, స్వతంత్ర దేశంగా ప్రకటింపచేసి, ఆనక క్రిమియా పార్లమెంటులోనే ఒక తీర్మానం ద్వారా రష్యాలో విలీనం చేయించాడు.
అప్పుడు అమెరికా మాత్రం ఏం చేయగలిగింది అనేకంటే ఏం చేసిందనేది అసలు ప్రశ్న. ఏవో ఆంక్షలు విధించి చేతులు దులుపుకుంది. అమెరికా మిత్ర దేశాలు కూడా అదే పని చేసాయి. రష్యాతో వున్న అవసరాల రీత్యా ఆ ఆంక్షలన్నీ మెల్లగా నీరుగారిపోయాయి. కానీ రష్యా పక్కలో బల్లెంగా ఉక్రెయిన్ని తీర్చిదిద్దాలనే ప్రయత్నాల్ని అమెరికా మాత్రం మానలేదు. ఇప్పుడు ఉక్రెయిన్లోని రష్యన్ మూలాలు అధికంగా వుండే రెండు ప్రావిన్సులలో తిరుగుబాటు దళాలకు మద్దతిచ్చి, ఆ రెండింటినీ స్వతంత్ర దేశాలుగా గుర్తించినా అమెరికా ఏవో ఆంక్షలు విధించడం మినహా ఏమీ చేయలేదు. చేయగలిగినా చెయ్యదు కూడా. ఎందుకంటే అమెరికా సైనికపరంగా ఏం చేసినా అది మూడో ప్రపంచ యుద్ధానికే దారి తీయొచ్చు. అప్పుడు రష్యా పక్కన వుండి మద్దతిస్తున్న చైనా, నార్త్ కొరియా ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతాయి.
రష్యా దూకుడు నేపథ్యంలో.. ప్రస్తుతం అమెరికా, ఉక్రెయిన్ బలిపశువైనా పర్లేదు ఏదో ఒక పరిష్కారం రావాలనే కోరుకుంటున్నట్లు పరిణామాలు సూచిస్తున్నాయి. తాజా వార్తల ప్రకారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని ఆక్రమించుకోబోతున్న తరుణంలో అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి దేశం నుండి సురక్షితంగా తరలించే సదుపాయాన్ని కల్పిస్తానని చెప్పింది. అంటే దేశాన్ని రష్యాకి అప్పగించేయమనే కదా! సోవియెట్ నుండి వేరుపడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన ఉక్రెయిన్ ఈ శతాబ్ది మొదటి నుండి వుంటే అమెరికా అనుకూల లేదా రష్యా అనుకూల అధ్యక్షుడినే కలిగి వుంటున్నది. ఉక్రెయిన్లో ప్రస్తుతం అధికారంలో వున్నది అమెరికా అనుకూల అధ్యక్షుడు వ్లదిమిర్ జెలెన్స్కీ. అతనో భయంకర అవినీతిపరుడనడానికి ఆధారులున్నాయి. దేశాధినేతల అవినీతిని వెలికితీసిన పండోరా పేపర్స్ ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.
ఇప్పుడు ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ప్రతిపాదన నేపథ్యంలో రష్యా తాడో పేడో తేల్చుకోదల్చుకున్నది. ఈ దేశానికి నాటో సభ్యత్వం ఇస్తే రష్యాకి నిజంగా చాలా ప్రమాదకరం.అమెరికా రష్యాలోని ఏ ప్రాంతానికైనా గురిపెట్టగలదు. పుతిన్ ప్రశ్న ఏమిటంటే “మేము కెనడాలో బాలిస్టిక్ మిసైల్స్ ని వైట్ హౌస్ వైపు గురిపెడితే అంగీకారమేనా?”అని! అయితే నాటో కూటమిలోని ముఖ్య దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ ఉక్రెయిన్ కి నాటో సభ్యత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతను కలిగివున్నాయి.అవి ఒకానొక సందర్భంలో ఉక్రెయిన్ కి సభ్యత్వ నిర్ణయాన్ని వీటో కూడా చేసాయి.ఎందుకంటే ఆయా దేశాలకు రష్యాతో చమురు, గ్యాస్ అవసరాలు చాలా వున్నాయి. అరబ్బు దేశాల కంటే, అమెరికా కంటే అతి చవకగా ఉక్రెయిన్ గుండా వేసిన సొరంగ మార్గం (నోర్ద్ లైన్ 1)ద్వారా రష్యా గ్యాస్ అందిస్తుంది ఆ దేశాలకు. అందుకు ఉక్రెయిన్ కి మంచి రుసుము కూడా చెల్లించేది రష్యానే. ఈ విషయమై రష్యాని ఉక్రెయిన్ బ్లాక్ మెయిల్ చేయడంతో ఉక్రెయిన్ తో సంబంధం లేకుండా వేరే మార్గంలో నోర్ద్ లైన్ 2 అనే మరో మార్గం కూడా రష్యా నిర్మించింది. దానితో ఉక్రెయిన్ తన ఆదాయాన్ని కోల్పోయింది. ఉక్రెయిన్ తన శక్తిసామర్ధ్యాల పట్ల, తన పరిమితుల పట్ల ఒక సరైన అంచనా లేక అమెరికా తరపున రష్యాని చికాకు పరిచే ధోరణి అవలంభించడం ఆ దేశపు నాయకత్వానికి వున్నఅవగాహనా రాహిత్యానికి, మూర్ఖత్వానికి ఓ నిదర్శనం.
అసలు నిజానికి ప్రపంచంలో ఏ మూల రెండు దేశాల మధ్య తగాదా వుందన్నా అక్కడ అమెరికా వేలిముద్రలు ఖచ్చితంగా వుంటాయి. అమెరికా జోక్యం చేసుకొని ఏ దేశ సమస్యల్ని పరిష్కరించిన దాఖలా ఇప్పటివరకు లేదు.ఏదో వంక పెట్టుకొని ఆ వివాదాల్లో దూరడం ఒకరి మీదకి మరొకరిని రెచ్చగొట్టి ఆయుధాలు అమ్ముకోవడమే చేస్తుంది. తాను సృష్టించిన అల్ కైదాని నిర్మూలించి, తాలిబాన్లను తరిమేసి ఆఫ్ఘనిస్తాన్లో ఇరవై ఏళ్లు తిష్ట వేసి అధికారాన్ని తిరిగి తాలిబాన్లకే అప్పగించింది. ఇరాక్ ని ధ్వంసం చేసింది. ఇరాన్, నార్త్ కొరియాని కూడా ధ్వంసం చేయాలని చూసింది.కానీ తన వల్ల కాక ఊరకే కేకలు పెడుతుంటుంది. పైగా ఐక్య రాజ్య సమితి వంటి ఉన్నత అంతర్జాతీయ వ్యవస్థల్ని గాజుబొమ్మల్లానో లేదా దిష్టిబొమ్మలానో ఎందుకూ పనికిరాకుండా చేసింది. ఇంత సంక్షోభం వస్తే ఏ అంతర్జాతీయ వ్యవస్థకి ఒక నోరు లేకుండా పోయింది. ఆ వ్యవస్థల్ని అన్నింటినీ నిరుపయోగంగా మార్చేసింది. ఈ పాపం అంతా అమెరికా ఖాతాలోనే వేయాలి. రష్యా దాడిని ఆపడానికి అమెరికా చేసింది శూన్యం. ఎలాంటి దౌత్యపరమైన చర్యలూ లేవు. రష్యా మీద ఆర్ధికపరమైన ఆంక్షలు ఉక్రెయిన్ కి ఏమాత్రం ప్రయోజనకరం కాదు. వాటిని తట్టుకొని నిలబడగలిగే స్థితిలో రష్యా వుందనేది స్పష్టం. విషయం మిలటరీ యాక్షన్ దాకా వెళ్లేముందుగా రష్యాతో శిఖరాగ్ర చర్చలు జరిపి వుండాల్సింది. కేవలం బైడెన్ ఒకసారి పుతిన్ తో ఫోన్లో మొక్కుబడిగా మాట్లాడితే ఏం ప్రయోజనం వుంటుంది? కనీసం మాస్కో వచ్చి పుతిన్ తో సమావేశమైన ఫ్రాన్స్ అధ్యక్షుడి పాటి సానుభూతి కూడా బైడెన్ చూపించలేదు.
అసలు ఇప్పుడు ఉక్రెయిన్ మీద జరుగుతున్న దాడిని యుద్ధం అనొచ్చా అనేది ఒక ముఖ్యమైన అంశం. ఉక్రెయిన్ని అక్రమించే ఉద్దేశ్యం లేదని రష్యా చెబుతున్నది.పుతిన్ ఉద్దేశ్యం స్పష్టమే. జెలెన్స్కీని పదవీచ్యుతుడిని చేయడమే.అమెరికా కాదు కదా మరే ఇతర నాటో దేశం కానీ, నాటో దళాలు కానీ రష్యాతో పోరాటం చేయవు (పోరాటం చేయబోమని వాళ్లే చెప్పారు) కాబట్టి ఇప్పటికే బలహీనపడిన ఉక్రెయిన్ని మరింత భయపెట్టి శుష్కింపచేసి తిరుగుబాటుని ప్రోత్సహించడం లేదా కనీసం జెలెన్స్కీ ప్రభుత్వాన్ని పడగొట్టి, కొత్తగా రాబోయే ప్రభుత్వంతో అతడిని ఖైదు చేయించడం, తన అనుకూల నాయకత్వానికి ఉక్రెయిన్ పగ్గాలు అందించడం. దాడిని విరమించానికి పుతిన్ డిమాండ్ కూడా స్పష్టంగానే వుంది. ఉక్రెయిన్, జార్జియాలకు నాటో సభ్యత్వం ఇవ్వబోమని అమెరికా నుండి చట్టబద్ధమైన హామీ కావాలని అడుగుతున్నాడు. యుద్ధమంటూ జరిగితే నాటో దళాలు రంగంలోకి దిగితేనే జరుగుతుంది. అప్పుడు జరిగేది బహుశా మూడో ప్రపంచ యుద్ధమే. కానీ ప్రపంచం అందుకు సిద్ధంగా లేదు. కరోనా అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థల్ని ధ్వంసం చేసేసింది ఇప్పటికే. నాటో దళాల ద్వారా మిలటరీ ట్రెయినింగ్, కొన్ని ఆయుధాలు ఉక్రెయిన్ కి అందినప్పటికీ అది రష్యాని నిలువరించడానికి ఏ మూలకూ చాలదు. తనని నమ్ముకున్న వారి పట్ల శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అనే పాలసీని అమలు చేసే అమెరికాని, ఇతర పశ్చిమ దేశాల్ని నమ్ముకొని ఇంతదాకా తెచ్చుకున్న ఉక్రెయిన్ ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోయింది. ఒక్కొక్క కీలక ప్రాంతాన్ని, నగరాన్ని రష్యా కబళించి వేస్తుంటే బేరుమంటున్నది. అమెరికా చేతిలో పావుగా మారినందుకు మూల్యం చెల్లిస్తున్నది. సోవియెట్ విచ్చిన్నం తరువాత ఉక్రెయిన్ ఒకప్పుడు అణ్వాయుధ సంపద కలిగిన దేశం. ఏవో తాయిలాలకు లొంగిపోయి అణ్వాయుధ ప్రయోగానికి సంబంధించి కీలక ప్రక్రియల్ని 1994లో బుడాపెస్ట్ ఒప్పందం ప్రకారం రష్యాకు వదులుకుంది. ఇప్పుడు ఆ ధైర్యం కూడా లేదు.
అసలు పుతిన్ ఉద్దేశ్యం సోవియెట్ తరహా కూటమిని పునరుద్ధరించడమనే వాదనలు వినిపిస్తున్నాయి. అతనిలో నేషనలిజాన్ని చూసి హిట్లర్ తో పోల్చేవాళ్లూ వున్నారు. ఇప్పుడు రష్యాలో వున్నది కమ్యూనిస్టు ప్రభుత్వం కానందువల్ల ఏకధృవ కేపిటలిస్టు ప్రపంచాన్ని ఎదుర్కోడానికే అతను సోవియెట్ తరహా అమెరికా వ్యతిరేక సోషలిస్టు కూటమిని స్థాపించాలని ఆశిస్తున్నాడని అనుకోలేం. అయితే ఏ పోటీ లేకుంటే అమెరికా అనే ఏకధృవ అధికార కేంద్రమే ప్రపంచాన్ని ఏలుతుంది కదా, దాని దోపిడీని నిలువరించాలి కదా అని వాదించే వాళ్లూ ఉన్నారు. ఇప్పుడు దాడి అనంతరం రష్యా అనుకూల కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సోవియెట్ ని పునరుజ్జీవింపచేయాలనే ఆశయాన్ని పుతిన్ నెరవేర్చుకోవచ్చు. ఏది ఏమైనా ఈ పరిణామాలన్నీ మళ్లీ ఓ కోల్డ్ వార్ వైపుకి దారి తీయొచ్చు.రెండు అగ్ర రాజ్యాల విస్తరణ కాంక్షకి, సహాయం,స్నేహం పేరుతో ఆయుధ వ్యాపారాలకు తావు ఇవ్వొచ్చు. ప్రస్తుత పరిస్తితుల్ని గమనిస్తుంటే రాబోయే వారం రోజుల్లో ఏదో ఒక పరిణామం జరిగి ఒక తాత్కాలిక పరిష్కారం దొరకొచ్చు.ఎందుకంటే దీర్ఘకాలిక యుద్ధాలు చేసే ఓపిక ఏ దేశానికీ ఇప్పుడు లేదు.
ఇంక ఈ విషయంలో భారత్ వైఖరి విషయానికి వస్తే నిజానికి అనేక సందర్భాల్లో ఇండియాకి అమెరికా ఎంతో వ్యతిరేకంగా వ్యవహరించింది.మన మీద ఎన్నోఆంక్షల్ని విధించింది. బలహీనం చేయాలని చూసింది. మొదటి నుండి భారత్ రష్యాలు నిలకడైన మిత్ర దేశాలుగా వున్నాయి. ఉక్రెయిన్ విషయంలో రష్యాకి చైనా, నార్త్ కొరియా బహిరంగంగానే మద్దతిస్తున్నాయి. సహజంగానే భారత్ తటస్థ విధానాన్ని అవలంబిస్తున్నది. మరో మార్గం లేదు. పాత ఒప్పందాలకి కట్టుబడి వుండమని చెబుతున్నది. తాజా వార్త ఏమిటంటే అమెరికా ప్రవేశపెట్టిన రష్యా వ్యతిరేక తీర్మానం వోటింగ్ కి భారత్ గైర్హాజరైంది.
ఇప్పుడు మన దేశ పౌరులందరినీ బాధ పెడుతున్న విషయం ఏమిటంటే ఉక్రెయిన్లో వేలాదిమంది భారత విద్యార్ధులు చిక్కుకుపోవడం. ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లో అర్ధం కాదు అసలు. ఫిబ్రవరి 16నే రష్యా దాడి చేస్తుందని అమెరికా ఒక వారం ముందు నుండీ చెబుతున్న నేపధ్యంలో గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నది ప్రభుత్వం. రెండు దేశాల మధ్య యుద్ధం “అఖండ” సినిమాలాంటిది కాదు కదా రక్తపాతం, ప్రాణనష్టాలనేవి కేవలం వెండితెరమీదనే అనుకోడానికి! ప్రస్తుత దారుణ పరిణామాలకు నేను మాత్రం ఎవరి బతుకుని వాళ్లని బతకనీయని అమెరికాని ఏ-1గా భావిస్తున్నాను. ఆ తరువాతనే రష్యా ఏ-2, ఉక్రెయిన్ ఏ-3 అని ప్రకటిస్తున్నాను. మరి మీరు?