అరణ్య కృష్ణ
సామాజిక రాజకీయ విశ్లేషకులు
కేసీఆర్ టీఆర్ ఎస్ స్థానంలో బీఆర్ ఎస్ అనే జాతీయ పార్టీ పెట్టడం చాలా ఆశ్చర్యం, నిరాశ కలిగించింది. ఇది దిద్దుకోగలిగితే దిద్దుకోవలసిన తప్పిదం అనుకుంటున్నా. పార్టీ పేరు నుండి తెలంగాణ అనే పదం తుడిపేయడం టీఆర్ ఎస్ ఆవిర్భవ సందర్భాన్ని, తెలంగాణ ప్రత్యేక అస్థిత్వాన్ని ఆ పార్టీ రాజకీయాల నుండి తుడిపేసుకోవడం వంటిదే. టీఆర్ ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టే అధికారంలోకి రాగలిగింది. ప్రాంతీయ పార్టీలు భారత్ వంటి ప్రజాస్వామిక దేశంలో సమాఖ్య స్ఫూర్తికి, ప్రాంతీయ అస్థిత్వ ప్రాధాన్యతకి సంకేతం.
అసలు టీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవానికి ఉన్న లక్ష్యాలేమిటి? కేవలం రాష్ట్ర సాధనేనా? ఆరు దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాలన్నీ చక్కదిద్దబడ్డాయా? టీఆర్ ఎస్ వంటి బలమైన ప్రాంతీయ పార్టీ లేకపోయినా భవిష్యత్తులో మరే రకమైన అన్యాయాలు, వివక్ష జరగబోవనే హామీ ఉందా? అంటే తెలంగాణలో ఇంక ప్రాంతీయ పార్టీ అవసరమే లేదా? ఈ సందేహాలన్నీ కలుగుతున్నాయి.
టీఆర్ ఎస్ మౌలికంగా ఒక ప్రాంతీయ పార్టీ అని నేనేం పదే పదే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు దాన్ని బీఆర్ ఎస్ గా మార్చడం అనేది రూపాంతరం చెందడం కిందకి రాదు. టీఆర్ఎస్ అనే ప్రాంతీయ పార్టీ మాయమవడమే. దాన్ని రద్దు చేయడమే! ఎందుకంటే బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్, బీజేపీ వంటి కేంద్రంలో అధికారాన్ని అభిలషించే ఒక జాతీయ పార్టీనే అవుతుంది కాబట్టి. దానిలో ప్రాంతీయ స్వభావం ఉండదు కాబట్టి. అందులో తెలంగాణతనం ఉండదు కాబట్టి. ఈ పరిణామం ప్రజలకు ఏ హామీ మీద, ఏ ప్రాంతీయ అస్తిత్వ అభివృద్ధి మీద హామీలిచ్చి అధికారంలోకి వచ్చారో దాన్ని తుంగలో తొక్కినట్లు కాదా?
అసలు టీఆర్ ఎస్ ని బీఆర్ ఎస్ గా మార్చే ముందు కేసీఆర్ ప్రజలకు చెప్పి, ఒప్పించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే తెరాస అవసరం తెలంగాణకి ఎలా తీరిపోయిందో వివరించడం! ఈ విషయంలో ఆయన తాను ప్రజలకి జవాబుదారీని కాదనుకోవడం బాధాకరం. ఏ ప్రాంతీయ స్ఫూర్తితో తనని నాయకుడిని చేసి, అధికారం అప్పచెప్పి, అందలం ఎక్కించారో ఆ ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం, చిన్న చూపు చూడడం కూడా! తెరాస విజయం వెనుక ఆచార్య జయశంకర్ వంటి సిద్ధాంతకర్తలు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీతో సహా అనేకరంగాల కార్మికులు, యూనియన్లు, విద్యార్ధులు, ప్రాంతీయ అస్తిత్వాన్ని గానం చేసి చిందేసిన కళాకారులు, మహిళా సంఘాలు, కొన్ని వామపక్ష పార్టీలు…ఇలా ఎన్నోప్రాంతీయ అస్తిత్వ బావుటాని ఎగరేసిన అనేక శక్తులు ప్రత్యేక రాష్ట్రం కోసం గర్జించి ఉద్యమిస్తేనే టీఆర్ ఎస్ విజయవంతమైంది.
ఉద్యమకారుల బలిదానాలు, సకల జనుల సమ్మెలు, ఎన్నో కేసులు, కొట్లాటలు, రాస్తారోకోలు, హర్తాళ్లు, బందులు….ఇలా అనేక ఉద్రిక్తతల మధ్య ప్రజా ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం హోరు పెట్టింది. కేంద్రంలో, రాష్ట్రంలో పాలక పార్టీ మీద విరుచుకుపడింది. కేసీఆర్ పదేపదే చెప్పుకున్నట్లు “ఉఫ్ అని ఊదేస్తే ఎగిరిపోయే ఓ బక్క ప్రాణి” ఒంటరిగా సాధించిన విజయమైతే కాదు. టీఆర్ ఎస్ ని బీఆర్ ఎస్ గా మార్చడం ద్వారా ఆయన వారినందరినీ తీసి పడేసినట్లే అనిపిస్తున్నది. “ఇన్నాళ్లు తెలంగాణ కోసం కష్టపడ్డాం. ఇప్పుడు దేశం కోసం అంతే కష్టపడతాం” అంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఇంక ప్రత్యేకంగా తెలంగాణ కోసం చేసేదేమీ లేదా? పక్కనున్న ఏపి, కర్నాటక, మహరాష్ట్ర ఎంతో తెలంగాణ కూడా అంతేనా? కేవలం వాటిలో ఒకటేనా?
మామూలు రాజకీయ పార్టీలకు, ఉద్యమ పార్టీలకు హస్తిమశకాంతరం ఉంటుంది. మామూలు రాజకీయ పార్టీలు అధికారమే పరమావధిగా ఉంటాయి. అందులో వాటికేం ముసుగులుండవు. ఉద్యమ పార్టీలు ఒక ప్రత్యేక లక్ష్యంతో ఏర్పడతాయి. ఆ లక్ష్యాలలో కొన్ని ప్రత్యేక రాష్ట్ర సాధన వంటివి ప్రత్యక్షంగా కనబడతాయి. అధికార సాధన అందులో ఒక భాగం మాత్రమే. మరికొన్ని లక్ష్యాలు నిరంతర స్ఫూర్తిని రగిలించేవిగానూ, పార్టీకి టార్చ్ బేరర్ గానూ ఉంటాయి. ఈ పరోక్ష లక్ష్యాల్లో ముఖ్యమైంది అధికారంలో వున్నా, లేకున్నా భవిష్యత్తులో ఆ రాష్ట్రానికి ఏ రకమైన అన్యాయం జరక్కూడదనేది ముఖ్యమైనది. ఇందుకు ప్రాంతీయ సెంటిమెంట్ ముఖ్యమైనది. బీఆర్ ఎస్ ఏర్పడితే తెలంగాణకి అన్యాయం ఏమీ జరగదు, భవిష్యత్తులో ఎలాంటి నష్టం ఉండదనే వాదన చేయొచ్చు. బీఆర్ ఎస్ ఏమీ ప్రాంతీయ పార్టీల సమాఖ్య పార్టీ కాదు. అది మిగతా అన్ని జాతీయ పార్టీల వంటి ఒక మామూలు పార్టీ మాత్రమే. ఈ రకంగా బీ ఆర్ ఎస్ వల్ల తెలంగాణకి వున్న పెద్ద రాజకీయ భరోస మాయమైనట్లే అని నేననుకుంటున్నా.
కాసేపు ప్రాంతీయ పరిస్థితిని పక్కన పెట్టి జాతీయ స్థాయిలో పరిస్తితి గురించి ఆలోచిద్దాం. గత కొద్ది నెలల నుండి కేసీఆర్ హఠత్తుగా కేంద్రానికి వ్యతిరేకంగా గళం పెంచుతున్నారు. ఆయనతో పాటు ఆయన బంధు, పార్టీ గణం కూడా! ఇది చాలా మంచి పరిణామమే. అయితే గమ్యానికి చేర్చే గమనం కూడా విలువలతో పాటు వివేకాన్ని కలిగి వుండాలి. దేశ స్థాయిలో మత తత్వ రాజకీయాలు చేస్తూ, మైనారిటీల అస్తిత్వాన్ని ప్రమాదంలోకి తోస్తూ, ప్రజల్ని విభజిస్తూ, విద్వేషకర ఫాసిస్టు రాజకీయాలు నడుపుతున్నారని కేసీఆరే విమర్శిస్తున్నారు. మరి ఆ విద్వేష రాజకీయాలకి విరుగుడుగా ఎన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల్ని బీఆర్ ఎస్ కలుపుకుపోతున్నది? బీజేపీ మీద అభిప్రాయాల్ని మార్చుకోకుండానే టీఆర్ ఎస్ “గానే ఆ పని చేయలేదా? ఒక పక్క “భారత్ జోడో యాత్ర”తో బలంగా దూసుకు వస్తున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ ని బలోపేతం చేయడం ద్వారా బీజేపీకి ఓ బలమైన సవాల్ విసురుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తో విభేదాలు కూడా రాష్ట్రాన్ని దాటి జాతీయ స్థాయికి తీసుకెళ్లడమేగా బీఆర్ ఎస్ ఏర్పాటు వల్ల జరిగేది? ఇది ఎవరికి ప్రయోజనమో కేసీఆరే చెప్పాలి.
బీజేపీని, కాంగ్రెస్ ని ఒకే గాటన కట్టడం (ప్రస్తుత పరిస్థితుల్లో) ఎవరికి మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాలా? ఒక విస్తృత ప్రతిపక్ష కూటమికి తెరాసని మించి బీఆర్ ఎస్ ఏ మేరకు దోహదం చేయగలదు? మమతతో విభేదాలు, కాంగ్రెస్ పట్ల అభ్యంతరాలకి కారణం కేసీఆర్ ప్రధానమంత్రి అభ్యర్ధిత్వానికి అడ్డంకులనేగా? “తెలంగాణ పరిపాలనా మోడల్”ని దేశమంతా విస్తరించాల్సిన అవసరం ఉందనడంలో, అందుకే జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నామనడం ఆయన మనసులోని మాట చెబుతున్నది కదా! ఇది అసలు వాస్తవిక దృక్పథమేనా?
అసలు తెర వెనుక రాజకీయాలు వేరే వున్నట్లు కొంతమంది కేసీఆర్ వ్యతిరేకులు అంటున్నారు. కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యుల ఇళ్ల మీద ఇడి, సీబీఐ దాడులు విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ముఖ్యుల పేర్లు తీసుకొని ఎంత మిలిటెంట్ గా విమర్శించినా కేసీఆర్ పట్ల పాలక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ప్రతిపక్ష సామర్ధ్యాన్ని కేసీఆర్ బలహీనం చేస్తారనే పాలక కూటమి విశ్వాసాన్ని ఐనా కేసీఆర్ దృష్టిలో పెట్టుకోవాలి.
తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ ని బలంగా ఉంచుతూ సుపరిపాలన చేయగల ప్రాంతీయ పార్టీ వున్నంత కాలం బీజేపీ వంటి జాతీయ పార్టీకి ఆస్కారమే లేదు. ఇప్పుడు టీఆర్ ఎస్ ని బీఆర్ ఎస్ గా మార్చడం ద్వారా బీజేపీకి ప్రాంతీయ సెంటిమెంట్ అనే పెద్ద అడ్డంకిని తొలగించడమైంది.
అసలు కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లకూడదని ఎవరం కోరుకోవడం లేదు. మంచిదే వెళితే. అది ఆయన ఇష్టం మీద, దానికి ఆయన పార్టీ మద్దతు మీద ఆధారపడి వుంటుంది. అయితే దానికి టీఆర్ ఎస్ పార్టీనే మాయం చేయాలా? పేరు మాత్రమే మార్చారని ఎవరైనా తర్కానికి అనొచ్చు. కానీ ఒక ప్రాంతీయ పార్టీలోంచి ఆ ప్రాంత పేరునే తీసేస్తే ఆ పార్టీ లేనట్లే లెక్క. టీఆర్ ఎస్ ని బీఆర్ ఎస్‌గా మార్చకుండానే, పార్టీ nomenclature లో ప్రాంతీయతని వదులుకోకుండానే బీఆర్ ఎస్ ఏర్పాటు చేయడానికి ఏమిటి సమస్య? టీఆర్ ఎస్ , బీఆర్ ఎస్ రెండూ కొనసాగొచ్చుగా! మళ్లీ చెబుతున్నా గమ్యమే కాదు గమనం కూడా వివేకంతో, విలువలతో కొనసాగాలి.