హైదరాబాద్ లో నాలాల సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ కు సాయమడిగితే లక్షకు పైగా జనాభా ఉన్న నగరాలు అమృత్ లో చేరాలని కేంద్రం పెద్దలు చెప్పారని అన్నారు. కోటికి పైగా జనం నివసిస్తున్న నగరాల్లో కేంద్రమిచ్చే రూ.200-300 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు.
వర్షాకాలం వచ్చేలోపు నాలాల పనులు పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. భాగ్యనగరంలో జలదిగ్బంధం అయినప్పుడు కేంద్ర మంత్రులు వచ్చి చూశారని.. కానీ అరపైసా కూడా సాయం చేయలేదని మండిపడ్డారు. గుజరాత్ కు మాత్రం మోఢీ వేయి కోట్ల సాయాన్ని ప్రకటించారని విమర్శించారు.
కంటోన్మెంట్ లోని మిలటరీ ప్రాంతాల్లో కేంద్రం తీరు సరిగా లేదని విమర్శించారు. ఎన్ని సార్లు చెప్పినా కేంద్రం వినిపించుకోవడం లేదని ఆరోపించారు. కంటోన్మెంట్ లో అడ్డంగా రోడ్డు నిర్మించారని అన్నారు. దేశంలో తెలంగాణ భాగం కానట్లు కేంద్రం వ్యవహరిస్తోందని వ్యఖ్యానించారు. కేంద్రం సాయం చేయకపోగా.. పనిచేసే వారికి మాత్రం అడ్డంకులు సృష్టిస్తుందని మండిపడ్డారు.
నగరంలో రూ.3,866 కోట్లతో వంద శాతం సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులన్నీ పూర్తవుతాయని చెప్పారు. 2వేల ఎంఎల్‌డీల మురుగునీటి శుద్ధీకరణ సామర్థ్యాన్ని ఏర్పరుచుకున్న నగరంగా హైదరాబాద్ ఆవిర్భవిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.