ఢిల్లీ ముఖ్యమంత్రిగా అర్వింద్ కేజ్రీవాల్ (51) ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కేజ్రీవాల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ ” ఈరోజు మీ కుమారుడు మూడో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు… ఇది నా విజయం కాదు…ఇది ఢిల్లీ ప్రజల విజయం…ప్రతి కుటుంబం…ప్రతి తల్లి…ప్రతి విద్యార్ధిది… గత ఐదేళ్లలో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆనందం కోసం ప్రయత్నించాం…ఢిల్లీ ప్రజల జీవితాలకు కొంత ఊరట నిచ్చాం” అని అన్నారు.
కేజ్రీవాల్ తో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, రాజేంద్రపాల్ గౌతమ్, ఇమ్రాన్ హుస్సేన్ లున్నారు. ఢిల్లీలోని చారిత్రాత్మక రెడ్ ఫోర్ట్ ముందున్న రాంలీలా మైదానంలో ఆదివారం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల నెవరినీ ఆహ్వానించలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలను ఆహ్వానించినప్పటికీ వారు హాజరుకాలేదు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉండడంతో ప్రధాన మంత్రి అక్కడికి వెళ్లారు. 40 వేల మందికి ఏర్పాట్లు చేశారు. రాంలీలా మైదానం చుట్టూ కేజ్రీవాల్ ఫోటోతో ఉన్న ”ధన్యవాద్ ఢిల్లీ ” పోస్టర్లు వెలిశాయి.
2015 లో మాదిరిగానే ఢిల్లీ నిర్మాతలుగా చెప్పే 50 మంది స్కూల్ టీచర్స్, డాక్టర్లు, ఎగ్జామ్ టాపర్స్, ఆటో డ్రైవర్స్, కేర్ టేకర్స్, శానిటేషన్ వర్కర్స్ ను ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించి ముఖ్యమంత్రితో వేదికను పంచుకునే అవకాశం కల్పించారు.
ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక అతిధి ”బేబీ మప్లర్ మ్యాన్” ఆకర్శనగా నిలిచారు. ఏడాది వయసున్న ఈ అమ్మాయి కళ్లజోడు, కేజ్రీవాల్ ధరించే మఫ్లర్ ను ధరించిన ఫోటో వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisements