వరంగల్ చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆగ్రహించారు. నేషనల్ హైవే 163పై రాస్తోరోకో చేపట్టారు. రెండు పంటలు పండే వ్యవసాయ భూములను అడ్డదారిలో లాక్కోవాలని చూస్తున్నారని… 500 మందికి పైగా రైతులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. తమ భూములు ఎవరికీ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. KUDA పేరుతో చేస్తున్న మోసాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
ల్యాండ్ బ్యాంక్ అంటూ వ్యవసాయ భూములను బ్లాక్ చేసి గుంజుకోవాలని చూస్తున్నారని.. ఈ చర్యలు వెంటనే ఆపాలని ఆందోళన చేపట్టారు రైతులు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 3వ డివిజన్ విలీన గ్రామాలైన అరేపల్లి, పైడిపల్లి, కొత్తపేట, ఎనుమాముల భూములను ప్రైవేట్ ఏజెన్సీ పేరుతో లాక్కొని… రైతులను రోడ్డుపాలు చేయాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.
అధికారులు స్పందించి సర్వేలు అపకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల నిరసనతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఎంత వారించినా వెనక్కి తగ్గకుండా 3 గంటలకుపైగా రాస్తారోకో నిర్వహించారు రైతులు.
గత వారం రోజులుగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ విలీన గ్రామాల్లో ప్రైవేట్ ఏజెన్సీ పేరుతో ల్యాండ్ బ్యాంక్ కోసం సర్వే చేపట్టారు. రైతుల నుంచి అన్ని వివరాలు సేకరించారు. రోడ్డు పేరుతో వివరాలు సేకరించారని… అయితే ఇన్ని వందల ఎకరాల్లో సర్వే ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నారు రైతులు.