ఫిఫా వాల్డ్ కప్ ఫైనల్ లో ఫ్రాన్స్ పై అర్జెంటీనా విజయం సాధించి సంబరాలు జరుపుకుంటుండగా.. కేరళలో మాత్రం ఇవి హింసాత్మక ఘర్షణలు, కత్తిపోట్లకు దారి తీశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అల్లరిమూకలు పోలీసులపైనే దాడికి పాల్పడ్డాయి. కొల్లం జిల్లాలోని లాల్ బహదూర్ స్టేడియంలోజరిగిన ‘విక్టరీ సెలబ్రేషన్స్’ లో పాల్గొని వస్తున్న 17 ఏళ్ళ అక్షయ్ అనే యువకుడు హఠాత్తుగా స్పృహ తప్పి కిందపడిపోయాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు
కన్నూరులో ముగ్గురు కత్తిపోట్ల దాడికి గురయ్యారు. తీవ్ర గాయాలకు గురైన వీరిని ఆసుపత్రిలో చేర్పించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తిరువనంతపురం, కోచ్చి , తలాస్సెరి తదితర జిల్లాల్లో తమను అదుపు చేయడానికి వచ్చిన పోలీసు అధికారులపై ఆందోళనకారులు తిరగబడ్డారు.
తలాస్సెరిలో ఓ ఎస్ఐ పై జరిగిన దాడిని కొందరు వీడియోగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎర్నాకులం లో నిన్న అర్ధరాత్రి ఓ గుంపు మెట్రో స్టేషన్ వద్ద ఓ పోలీసు అధికారిపై దాడి చేసింది. వారిని అదుపు చేయడానికి ఆయన యత్నించగా.. ఆయనను రోడ్డుపైకి లాక్కుని వచ్చి ఎటాక్ చేశారు.
మద్యం తాగిన యువకులు అనేక చోట్ల మత్తులో పోలీసులతో వాగ్వాదానికి దిగి.. వారిపై చేయి చేసుకున్నట్టు తెలిసింది. కేరళలో ఫుట్ బాల్ అభిమానులు వేల సంఖ్యలో ఉన్నారని, వీరంతా అర్జెంటీనా సంబరాల పేరిట ఇలా రెచ్చిపోయి రాష్ట్రంలో హింసకు పాల్పడ్డారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అల్లర్లకు పాల్పడినవారిలో చాలామందిని అరెస్టు చేసినప్పటికీ పలువురు పారిపోయారని తెలిసింది.