తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాదనలు జరిగాయి. ఒకరికొకరు మాటకు మాట కౌంటర్ ఇచ్చుకున్నారు. అయితే.. సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై బీజేపీ అధ్యక్షుడి కంటే కాంగ్రెస్ అధ్యక్షుడే ఎక్కువగా బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అవిభక్త కవలలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలతో సభలో ఒక్కసారిగా దుమారం రేగింది.
కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడితే అండగా ఉంటాం. కానీ.. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం సరైంది కాదని మండిపడ్డారు. భట్టి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. భట్టి చాలా మంచివారని.. కానీ వారి అధ్యక్షుడే అక్రమార్కులంటూ ఆరోపణలు చేశారు. దీనిపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భట్టి.. రికార్డుల నుంచి మంత్రి వ్యాఖ్యలను తొలగించాలని స్పీకర్ ను కోరారు.
ఇంతలో జోక్యం చేసుకున్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్ పుట్టినరోజున రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సీఎం పుట్టినరోజున సంతాప దినాలుగా చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునివ్వడంపై మండిపడ్డారు. అలాంటి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి ఉండడం వారి దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు.
దీనిపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భట్టి.. ఎక్కడో బయట మాట్లాడిన మాటలను సభలో ప్రస్తావించడం సబబుకాదన్నారు. మరోసారి జోక్యం చేసుకున్న కేటీఆర్.. రాహుల్ గాంధీపై అసోం సీఎం మాట్లాడిన మాటలను ప్రస్తావించారు. రాహుల్ గాంధీకి తొలుత అండగా నిలిచింది సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు. తాము ఎవరి దగ్గరా సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు కేటీఆర్.