ఎమ్మెల్యేలకు ఎర కేసులో నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది.
ఆ పిటిషన్ పై ఈ రోజు ధర్మాసనం వాదనలు విన్నది. తీర్పును హైకోర్టు రిజర్వ్ లో పెట్టింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించవద్దని ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
ఈ కేసులో సిట్ అత్యంత పారదర్శకంగా విచారణ జరుపుతోందన్నారు. సీఎం ప్రెస్ మీట్ ను కారణంగా చూపి దర్యాప్తు సంస్థను మార్చడం సరికాదన్నారు.
ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదుల వాదనలు ముగిశాయి. ఈ కేసులో లిఖిత పూర్వక వాదనలకు గడువు కావాలని దవే కోరారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ నెల 30 వరకు హైకోర్టు గడువు ఇచ్చింది. ఈ నెల 30లోగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.